మూవీ రివ్యూ: మీకు మీరే మాకు మేమే

Update: 2016-06-18 16:36 GMT
చిత్రం : ‘మీకు మీరే మాకు మేమే’

నటీనటులు: తరుణ్ శెట్టి - అవంతిక - కిరీటి - జెన్నీ - భరణ్ తదితరులు
సంగీతం: శ్రావణ్
ఛాయాగ్రహణం: సూర్య వినయ్
నిర్మాణం: నకమ ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్

హుస్సేన్ షా కిరణ్.. చాలామంది ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టైటిల్స్‌ లో ఈ పేరు గుర్తించే ఉంటారు. ఆ సినిమా ఆడియో వేడుకలో సైతం సుకుమార్ అతణ్ని వేదిక మీదికి తీసుకొచ్చి పరిచయం చేశాడు. ‘నాన్నకు ప్రేమతో’కు కథ అందించింది ఇతనే. ఆ సినిమా విడుదల్వడానికి ముందే హుస్సేన్ దర్శకుడిగా సినిమా మొదలుపెట్టేశాడు. అదే ‘మీకు మీరే మాకు మేమే’. అల్లు అరవింద్ బ్యాకప్ తో కొందర మిత్రుల సహకారంతో.. దాదాపుగా అందరూ కొత్తవాళ్లనే నటీనటులుగా పెట్టి ఈ సినిమా చేశాడు హుస్సేన్. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తెరమీద ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ:

ఆది (తరుణ్ శెట్టి) జాలీగా జీవితాన్ని గడిపేసే కుర్రాడు. చదువులో పూర్. ఖాళీ దొరికితే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ.. గేమ్స్ ఆడుకుంటూ.. మందు కొడుతూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. అలాంటి వాడికి అతడి కాలేజ్ లోనే జూనియర్ అయిన ప్రియ (అవంతిక) పరిచయమవుతుంది. ఆమెను రకరకాల ట్రిక్స్ ప్లే చేసి ప్రేమలో పడేస్తాడు ఆది. కానీ ఆమె ప్రేమలో పడ్డాక నిజాలన్నీ చెప్పేస్తాడు. అయినప్పటికీ ఆది అంటే ఇష్టపడుతుంది ప్రియ. కొన్ని రోజులు వీళ్ల లవ్ స్టోరీ బాగానే సాగుతుంది కానీ.. తర్వాత ఇద్దరి మధ్య తేడాలొస్తాయి. బాధ్యతా రాహిత్యంగా ఉండే ఆదితో గొడవపడి.. ఇద్దరం ఆరు నెలలు దూరంగా ఉందాం అని షరతు పెడుతుంది ప్రియ. మరి ఈ ఆరు నెలల్లో ఏం జరిగింది..? ఆదిలో ఏమైనా మార్పు వచ్చిందా..? ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ ఒక్కటయ్యారా లేదా అన్నది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘మీకు మీరే మాకు మేమే’లో ఓ సన్నివేశంలో హీరోయిన్ వచ్చి తన తండ్రితో తాను ప్రేమించిన అబ్బాయి గురించి చెబుతూ.. అతను సరిగా చదవడని.. సిగరెట్ తాగుతాడని.. మందు కొడతాడని.. కానీ అతనంటే తనకు చాలా ఇష్టమని అంటుంది. ఆ కుర్రాడిని ఒకసారి తీసుకురా మాట్లాడదాం అంటాడు హీరోయిన్ తండ్రి. కూతురు అలా చెప్పడమేంటి.. తండ్రి ఇలా బదులివ్వడమేంటి అనిపిస్తుంది ముందు. కానీ కూతురు తనతో మాట్లాడి వెళ్లిపోతుంటే మళ్లీ ఆ తండ్రి.. ‘‘నువ్వెందుకు అలా చెప్పావో నాకు అర్థం కాలేదనుకున్నావా. అన్ని చెడు విషయాలూ నువ్వే చెప్పేశావ్ కాబట్టి ఇక నేను ఏ కంప్లైట్ చేయడానికి ఉండదు. అతడిలో ఏ చిన్న మంచి ఉన్నా నేను ఇంప్రెస్ అయిపోతాను. అంతే కదా’’ అంటాడు. హుస్సేన్ షా కిరణ్.. కంటెంట్ ఉన్నవాడే అని చెప్పడానికి ఈ సన్నివేశం ఒక రుజువు. ఐతే ఇలాంటి కొన్ని సన్నివేశాలు పడినంత మాత్రాన మంచి సినిమా తయారైపోదు. ఓవరాల్ ఇంప్రెషన్ ఏంటన్నది ముఖ్యం. ‘మీకు మీరే మాకు మేమే’ అక్కడక్కడా ఎంటర్టైన్ చేస్తుంది కానీ.. ఓవరాల్ గా మంచి ఇంప్రెషన్ మిగిల్చేంత బలమైన ఇంపాక్ట్ మాత్రం వేయదు.

‘ఉయ్యాల జంపాల’ తరహాలో సహజమైన పాత్రలతో.. సహజమైన సన్నివేశాలతో ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీని చెప్పాలని ప్రయత్నించాడు హుస్సేన్ షా. సినిమాలో చెప్పుకోదగ్గ పాజిటివ్.. హీరో.. అతడి ఫ్రెండు (కిరీటి) మధ్య వచ్చే కామెడీనే. ‘ఉయ్యాల జంపాల’లో కొసమెరుపు లాంటి పెళ్లికొడుకు పాత్రలో వినోదాన్ని పంచిన కిరీటి.. ‘మీకు మీరే..’లో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిన ప్రతిసారీ నవ్వించే ప్రయత్నం చేశాడు. అతడి పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. హీరోకు.. అతడికి కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కథతో సంబంధం లేకుండా వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. లైటర్ వీన్లో సాగే కామెడీకి యూత్ ఆడియన్స్ బాగా కనెక్టయ్యే అవకాశముంది. ఇందులోని పాత్రలు.. సన్నివేశాలు.. కాన్సెప్ట్ కూడా కంటెంపరీగా అనిపిస్తాయి.

ఐతే అసలు కథను దర్శకుడు డీల్ చేసిన తీరే నిరాశ పరుస్తుంది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దాన్ని నరేట్ చేసిన తీరు సాదాసీదాగా అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని మంచి సన్నివేశాలు పడ్డా.. ఓవరాల్ గా అంత ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోయింది. అమ్మాయి-అబ్బాయి ప్రేమలో పడటం.. కొంత కాలం తర్వాత బోర్ కొట్టేయడం.. ఇగో సమస్యలు రావడం.. ఒకరికొకరు దూరం కావడం.. మళ్లీ ఒకరిని ఒకరు మిస్సవుతున్న ఫీలింగ్ తో దగ్గరవడం.. చెప్పాలనుకున్న పాయింట్ చాలా సింపుల్. ఐతే ఈ పాయింట్ చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలు అల్లుకోవడంలో దర్శకుడు విజయవంతం కాలేదు.

హీరోయిన్ హీరో ప్రేమలో పడటానికి.. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడానికి దారి తీసే సన్నివేశాలు కానీ చాలా మామూలుగా అనిపిస్తాయి. ఈ మాత్రం దానికే లవ్వా.. ఆ మాత్రం దానికే బ్రేకప్పా అనిపిస్తుంది. ఈ కాలం ప్రేమలు ఎలా ఉన్నప్పటికీ.. తెరమీద మరీ అంత సిల్లీగా లవ్ స్టోరీల్ని నడిపిస్తే చూసేవాళ్లకు అంతా సిల్లీగానే అనిపిస్తుంది. ఇద్దరూ విడిపోయాక స్ట్రాంగ్ ఎమోషన్ అంటూ ఏమీ లేకుండా అల్లాటప్పాగా కథనాన్ని నడిపించేసి.. క్లైమాక్స్ రాగానే హీరోతో ఎమోషనల్ డైలాగులు చెప్పించేసి.. ఇద్దరూ కన్నీళ్లు పెట్టేసుకుని కౌగిలించేసుకుంటే సరిపోతుందా? ప్రథమార్ధాన్ని సాధ్యమైనంత వరకు వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు.. అసలు కథను డీల్ చేయాల్సిన ద్వితీయార్ధంలో ట్రాక్ తప్పాడు. ఈ కథను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. అర్థం లేని సన్నివేశాలతో సాగే ద్వితీయార్ధం సినిమా మీద ఇంప్రెషన్ ను క్రమంగా తగ్గించేస్తుంది.

నటీనటులు:

‘మీకు మీరే మాకు మేమే’లో దాదాపుగా అందరూ కొత్తవాళ్లే నటించారు. ఎవ్వరూ కూడా నటిస్తున్నట్లు కాకుండా నిజ జీవితంలో ఎలా ఉంటారో అలా బిహేవ్ చేసినట్లు కనిపిస్తుంది. కొత్త కుర్రాడు తరుణ్ శెట్టి బావున్నాడు. నటనతోనూ ఇంప్రెస్ చేశాడు. ఐతే కొన్ని చోట్ల మరీ క్యాజువల్ గా.. నేచురల్ గా చేయడం వల్ల సన్నివేశాలు తేలిపోయాయి. ‘మాయ’ ఫేమ్ అవంతిక రెండో సినిమాకు చాలా మారింది. స్లిమ్ అయి అందంగా తయారైంది. నటనలో కూడా మెరుగు పడింది. అందర్లోకి ఎక్కువ ఆకట్టుకునేది కిరీటినే. మంచి పాత్ర పడితే కమెడియన్ గా రాణించగలనని అతను చాటుకున్నాడు. సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అతడే. జెన్నీ పర్వాలేదు. హీరోయిన్ తండ్రి పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్స్ దర్శకుడికి బాగానే సహకరించారు. శ్రావణ్ పాటలు ప్రత్యేకంగా వినదగ్గవేమీ కావు కానీ.. సినిమాలో బాగానే ఇమిడిపోయాయి. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. సూర్య వినయ్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ఎస్సెట్. చాలా మామూలు లొకేషనల్లో.. తక్కువ బడ్జెట్లో సినిమా తెరకెక్కినా.. ఆ ఫీలింగ్ ఏమీ కనిపించకుండా చేయగలిగింది అతడి కెమెరా పనితనం. మాటలు పర్వాలేదు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్.. రచయితగా.. దర్శకుడిగా అక్కడక్కడా తన టాలెంట్ చూపించాడు కానీ.. స్ట్రాంగ్ ఇంప్రెషన్ వేయలేకపోయాడు. ఎంచుకున్నది ఎలాంటి పాయింట్ అయినా.. దాన్ని బలంగానే చెప్పడానికే ప్రయత్నించాల్సింది. ‘ఉయ్యాల జంపాల’నే తీసుకుంటే అది చాలా సరదాగానే సాగుతుంది. కానీ అందులో ఎమోషన్ కూడా అంతే బలంగా ఉంటుంది. ప్రేక్షకులు రెండు విషయాలకూ కనెక్టయ్యారు. ‘మీకు మీరే..’లో కామెడీ మాత్రం కొంత వరకు ఇంప్రెస్ చేసింది. అంతకుమించి గుర్తుంచుకోవడానికేమీ ఉండదు.

చివరగా: కాసిన్ని నవ్వులు.. అంతకు మించేం లేదు

రేటింగ్- 2.25/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News