నెల రోజుల్లో నాలుగు మెగా సినిమాలు

Update: 2015-09-02 09:42 GMT
గత ఏడాది మెగా హీరోల జోరు మామూలుగా లేదు. రామ్ చరణ్ సంక్రాంతికి ‘ఎవడు’ సినిమాతో సందడి మొదలు పెడితే.. వేసవిలో అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’గా రెచ్చిపోయాడు. ఏడాది చివర్లో ఇద్దరు అరంగేట్ర మెగా హీరోలు తమ సత్తా చాటుకున్నారు. సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో, వరుణ్ తేజ్ ‘ముకుంద’తో విజయవంతంగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఇప్పటిదాకా మెగా హీరోల సందడి పెద్దగా కనిపించలేదు. ఒక్క అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మాత్రమే వచ్చింది. దానికి కూడా డివైడ్ టాక్ వచ్చింది. ఐతే ఈ నెలలో మళ్లీ మెగా హీరోల సందడి మొదలు కానుంది. నెల రోజుల వ్యవధిలో నలుగురు మెగా హీరోల సినిమాలు సందడి చేయబోతుండటం విశేషం.

ముందుగా సెప్టెంబరు 24న సాయిధరమ్ తేజ్ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ విడుదల కాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా వచ్చిన రెండు వారాలకు మెగా ఫ్యామిలీకి అత్యంత ప్రతిష్టాత్మకం అనదగ్గ ‘కంచె’ సినిమా వస్తోంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూశాక వరుణ్ తేజ్ రెండో సినిమాకే తన రేంజి ఎక్కడికో పెంచుకునేసేలా కనిపిస్తున్నాడు. ‘కంచె’ వచ్చిన వారానికే ‘రుద్రమదేవి’ వస్తోంది. ఇది ఫక్తు మెగా సినిమా అని చెప్పలేం కానీ.. మెగా హ్యాండు మాత్రం కీలకం. అల్లు అర్జున్ కీలకమైన పాత్రలో నటించగా..  మెగాస్టార్ చిరంజీవి తన గాత్రం అందించారు. రుద్రమదేవి తర్వాతి వారమో, లేదా ఆ పైవారమో.. రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ రిలీజ్ కాబోతోంది. చిరంజీవి అతిథి పాత్ర కూడా చేసిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి ఈ నాలుగూ కూడా బంపర్ క్రేజ్ ఉన్న సినిమాలే. మరి నెల రోజుల వ్యవధిలో రాబోతున్న ఈ నాలుగు సినిమాలు మెగా ఫ్యామిలీకి ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.
Tags:    

Similar News