మినీ రివ్యూ: '10th క్లాస్ డైరీస్'

Update: 2022-07-01 13:56 GMT
అవికా గోర్ - శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''10th క్లాస్ డైరీస్''. 'గరుడవేగ' సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.  SR మూవీ మేకర్స్ - అన్విత అవని క్రియేషన్స్ - అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ పతాకాలపై అచ్యుత్ రామారావు - రవితేజ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఈరోజు శుక్రవారం (జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'టెన్త్ క్లాస్ డైరీస్' కథ విషయానికొస్తే.. సోమయాజ్ (శ్రీరామ్) బాగా చదువుకుని అమెరికాలో బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అవుతాడు. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ... అతని జీవితంలో ఏదో చిన్న అంసతృప్తి. భార్య కూడా వేదిలేయడంతో ఏదో వెలితీతో జీవిస్తుంటాడు. తన లైఫ్ లో మిస్సవుతున్న ఆనందం ఏంటనేది తెలుసుకునే క్రమంలో.. టెన్త్ క్లాస్ లో తాను ప్రేమించిన ఫస్ట్ లవ్ చాందిని (అవికా గోర్) దగ్గరుందని తెలుసుకుంటాడు. ఆమెని కలిసేందుకు టెన్త్ క్లాస్ రీయూనియన్ ను ప్లాన్ చేస్తాడు. రీయూనియన్ లో చాందినీని సోము కలుసుకున్నాడా లేదా? అసలు చాందినీకి ఏమైంది? స్కూల్ డేస్ లో ప్రేమించుకున్న వాళ్లిద్దరు ఎలా విడిపోయారు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమాని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ మొదటి నుంచీ చెబుతూ వచ్చారు. అయితే ఇది వెన్నెల రామారావు జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ప్రేరరణతో రాసుకున్న కథ అని తెలుస్తోంది. ప్రేమికుడి నిర్లక్ష్యం - తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి లైఫ్ లో ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనేది ఈ సినిమాలో చూపించారు.

మంచి కథను ఎంచుకున్న దర్శకుడు దాన్ని మనసుకు హత్తుకునేలా తెరపై ఆవిష్కరించలేకపోయారు. ప్రేమించిన అమ్మాయి కోసం వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు గతంలో వచ్చిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తాయి. అయినప్పటికీ 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా అందరినీ స్కూల్ డేస్ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుందని చెప్పాలి. ఓవైపు నవ్విస్తూనే అమ్మాయిల ఎదుర్కొనే సమస్యలను చూపించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది.

'రోజాపూలు' సినిమాలో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీరామ్.. చాలా గ్యాప్ తర్వాత ఆకట్టుకున్నాడు. నిడివి కాస్త తక్కువే అయినా అవికా గోర్.. తన పరిధి మేరకు నటించి మెప్పించింది. శ్రీనివాస రెడ్డి - అర్చన - శివ బాలాజీ - వెన్నెల రామారావు - నాజర్ - హిమజ - భాను ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీనివాస్ రెడ్డి - అచ్యుత రామారావు కామెడీ టైమింగ్ తో అలరించారు.

ఇక దర్శకుడే సినిమాటోగ్రాఫర్ అవ్వడంతో తన అనుభవంతో పెద్ద సినిమా స్థాయిలో విజువల్స్ అందించారు. డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్ కు వచ్చేసరికి మాత్రం ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని 'టెన్త్ క్లాస్ డైరీస్'. కలిగిస్తుందని చెప్పవచ్చు.
Tags:    

Similar News