కోటను రాళ్లతో కొడతారంటూ మోహన్ బాబు..

Update: 2017-05-24 11:02 GMT
నటుడిగా గొప్ప పేరు సంపాదించి.. తిరుగులేని స్థాయిని అందుకున్న కోట శ్రీనివాసరావు రాజకీయ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఐతే తన విజయం గురించి అప్పట్లో చాలామందికి నమ్మకం లేదంటున్నారు కోట. స్వయంగా సినీ పరిశ్రమ నుంచే తన విజయంపై అనుమానాలు నెలకొన్నాయని.. మోహన్ బాబు అయితే తాను గెలిచే ఛాన్సే లేదన్నట్లుగా.. కొంచెం ఎగతాళిగా కూడా మాట్లాడారని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎన్నికలు ముగిశాక తాను మోహన్ బాబు హీరోగా నటిస్తున్న ‘పోస్ట్ మ్యాన్’ షూటింగులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చానని.. ఐతే అంతలోనే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు దగ్గర పడగా మూడు రోజుల పాటు విరామం తీసుకుని కౌంటింగ్ జరిగే చోటికి వెళ్లడం కోసం మోహన్ బాబుకు విషయం చెప్పానని కోట తెలిపారు. ఐతే ఆ సందర్భంగా మోహన్ బాబు.. ‘నువ్వు గెలవడమేంటి.. అసలు ఎన్నికల్లో నిలుచోవడమే తప్పు.. అది పక్కా కాంగ్రెస్ సీటు. గెలిచే ఛాన్సే లేదు’ అని తేల్చేశారని.. అయినా తాను ఆయన మాట వినకుండా విజయవాడకు వెళ్లాని నిర్ణయించుకున్నట్లు కోట వెల్లడించారు. ఒక వేళ తాను ఓడిపోతే.. ఓటమి భయంతోనే రాలేదంటారని.. గెలిస్తే కౌంటింగ్ రోజే ఇక్కడ లేని వాడు తర్వాత నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటాడు అనే మాట వస్తుందనే తాను విజయవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని.. ఐతే తన డ్రైవర్ని పిలిచి మోహన్ బాబు హెచ్చరించినట్లు చెప్పారు. కారును కౌంటింగ్ జరిగే ప్రదేశానికి దూరంగా ఉంచాలని.. కోట ఓడిపోతే జనాలు రాళ్లు విసిరే ప్రమాదం ఉందని మోహన్ బాబు అన్నట్లుగా కోట తెలిపారు. ఐతే ఆయన అంచనాలు తప్పి తాను దాదాపు 4 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గానని.. ఐతే అంతకుముందు అన్న మాటలన్నీ పక్కనబెట్టి తాను తిరగి ‘పోస్ట్ మ్యాన్’ షూటింగుకి వచ్చినపుడు మోహన్ బాబు తనకు ఘనస్వాగతం పలికి.. సత్కరించినట్లు కోట చెప్పారు.
Tags:    

Similar News