బాబు కామెంట్:హీరోల దగ్గర కుక్కల్లా బతుకుతున్నారు

Update: 2018-02-04 05:14 GMT
విషయమేదైనా తనదైన శైలిలో ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు సీనియర్ నటుడు మోహన్ బాబు. తాజాగా ఆయన ఇండస్ట్రీ నడుస్తున్న తీరుపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరికి వారే అన్నట్లు పరిస్థితి తయారైందని.. హీరోలకు భజన చేసే జనాలు ఎక్కువైపోయారని విమర్శించారు. ఈ విషయమై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. సినిమాల విడుదల తేదీల విషయంలో నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం లేదని.. ఎవరికి వారే అన్నట్లు పరిస్థితి తయారైందని.. పరిశ్రమలో గ్రూపులున్న మాట వాస్తవమని.. దీనిపై చర్చ అనవసరమని అన్నారు.

కొందరు నిర్మాతలు తమ సినిమా కొబ్బరి కాయ కొట్టిన రోజే రిలీజ్ డేట్ ప్రకటించామంటూ అబద్ధాలు ఆడేస్తున్నారని.. ఇలాంటి విషయాలకు పంచాయితీలు చేసేది.. పెద్దమనిషిగా నిలబడి సమస్యని పరిష్కరించేది ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమ జేబు నుంచి డబ్బులు తీసి సినిమాలు తీసేవాళ్లు తక్కువైపోయారని.. దొంగ డబ్బులు.. బినామీ డబ్బులతో సినిమాలు నిర్మిస్తున్నారని.. మంచి నిర్మాతల శాతం బాగా తగ్గిపోయిందని.. చిన్న నిర్మాతలకు అసలు గౌరవమే లేకుండా పోయిందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నిర్మాతలు హీరోల దగ్గర కుక్కల్లా బతుకుతున్నారని.. దర్శకులూ అలాగే తయారయ్యారని.. హీరోల చుట్టూ చేరి భజన చేసే బృందాలు ఎక్కువైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తన గురువు దాసరి నారాయణరావు లేని లోటు ఇండస్ట్రీలో బాగా కనిపిస్తోందని.. ఐతే ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మోహన్ బాబు అన్నారు.

Tags:    

Similar News