వెయ్యి కోట్ల సినిమా.. కామెడీ కాదు

Update: 2017-06-04 16:24 GMT
ఓవైపు దర్శకరత్న దాసరి నారాయణరావు మహాభారత కథను భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ఆశపడ్డారు. దానికి సంబంధించి పని కూడా మొదలుపెట్టారు. కానీ ఆ పని పూర్తి చేయకుండానే వెళ్లిపోయారు. మరోవైపు రాజమౌళి కూడా ‘మహాభారతం’ గురించి కలలు కంటున్నాడు. కానీ ఆ సినిమా తీయడానికి ఇంకో ఎనిమిదేళ్లు పడుతుందని అంటున్నాడు. షారుఖ్ ఖాన్‌ సైతం ‘మహాభారతం’ సినిమా చేయాలన్న కోరిక వెలిబుచ్చాడు. ఐతే వీళ్లందరి కంటే ముందు మోహన్ లాల్ హీరోగా మలయాళంలో మహాభారత కథతో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా అంటూ ప్రకటన వచ్చింది. కానీ ఈ ప్రకటన వచ్చాక ఏ అప్ డేట్ రాకపోవడంతో ఈ సినిమాపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

మోహన్ లాల్ ను పెట్టి వెయ్యి కోట్లతో సినిమా అంటే వర్కవుట్ కాదని.. ఈ సినిమా ప్రకటనకే పరిమితం అని మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ సినిమా నిర్మాతగా చెప్పుకున్న బీఆర్ శెట్టి గురించి ఎవరికీ ఏ సమాచారం లేకపోవడం.. ఆయన నుంచి అధికారిక ప్రకటన కూడా లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కేసినట్లే అనుకున్నారు. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ బీఆర్ శెట్టి కేరళలో అడుగు పెట్టాడు. మోహన్ లాల్ తో కలిసి ఆయన అభిమానుల్ని పలకరించాడు. కేరళ మోహన్ లాల్ అభిమానుల సంఘం ప్రతినిధులు.. బీఆర్ శెట్టితో కలిసి మోహన్ లాల్ కు సన్మానం కూడా చేశారు. ఈ సందర్భంగానే వెయ్యి కోట్ల మహాభారతం ప్రాజెక్టును ధ్రువీకరించాడు వ్యాపారవేత్త అయిన బీఆర్ శెట్టి. కాబట్టి ఈ సినిమా గురించి కమల్ ఆర్.ఖాన్ లాంటి వాళ్లు కామెడీలు చేయడం మానేస్తే బెటర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News