మోహన్ లాల్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి

Update: 2016-06-21 06:36 GMT
త్రిష పుష్కర కాలం నుంచి తెలుగు సినిమాలు చేస్తోంది. ఇప్పటికి కూడా ఏదైనా తెలుగు సినిమా కార్యక్రమానికి వస్తే తెలుగులో రెండు ముక్కలు మాట్లాడలేదు. ఎన్నడూ తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేయలేదు. డబ్బింగ్ చెప్పడానికి ఆసక్తి చూపించలేదు. ఇలాంటి హీరోయిన్లు ఇంకా చాలామంది ఉన్నారు. హీరోయిన్లనే కాదు.. చాలామంది పరభాషా నటులకు తెలుగు రాదు. డబ్బింగ్ తో లాగించేస్తుంటారు.

ఐతే ఇక్కడ మోహన్ లాల్ ను చూడండి. ఆయన తెలుగులోకి రావడం రావడమే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. భాష తెలియకుండా నటించడం సరికాదని నిర్ణయించుకున్న మోహన్ లాల్.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘మనమంతా’ సినిమాను ఒప్పుకున్న వెంటనే తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టారు. కొన్ని నెలల్లోనే తెలుగు భాషపై పట్టు సాధించారు. ‘మనమంతా’ సినిమాకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పేసుకున్నారు. ఈ ఆనందాన్ని పంచుకుంటూ డబ్బింగ్ చెబుతున్నప్పటి ఫొటోలు కూడా షేర్ చేశాడు మోహన్ లాల్.

అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ.. ఎంతో బిజీ అయినప్పటికీ మోహన్ లాల్ చూపించిన కమిట్మెంట్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. పరభాషా నటీనటులు మోహన్ లాల్ ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ‘మనమంతా’ జులైలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన గౌతమి నటిస్తోంది. ‘కేరింత’ ఫేమ్ విశ్వాంత్ ఓ కీలక పాత్ర పోషించాడు. సాయి కొర్రపాటి నిర్మాత.
Tags:    

Similar News