మోహన్ లాల్ తిట్టాడు.. క్షమాపణ చెప్పాడు

Update: 2018-09-17 13:24 GMT
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కోపం వచ్చింది. ఆ కోపంలో చెడామడా తిట్టాడు. కానీ ఆ కోపం చల్లారిన కాసేపటికే విచక్షణా గుర్తుకొచ్చింది. తాను చేసిన పనికి ఆయన క్షమాపణ చెప్పాడు. ఐతే లాల్ కు కోపం రావడానికి సహేతుకమైన కారణమే ఏంది. ఇటీవలే కేరళ వరదలతో అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. బాధితుల్ని ఆదుకునేందుకు తన వంతుగా రూ.25 లక్షల సాయం చేసిన లాల్.. దీంతో పాటుగా తన పేరిట నడుస్తున్న ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇందులో భాగంగా ఒక కార్యక్రమానికి ఆయన హాజరు కాగా.. ఒక రిపోర్టర్ ఆయన్ని అనుచితమైన ప్రశ్న వేశాడు. ఓ అత్యాచార ఘటన గురించి స్పందించమని అడిగాడు. దీంతో ఆయనకు కోపం నషాళానికి అంటింది.

నేను వచ్చిన కార్యక్రమం ఏంటి.. నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటి.. ఇలాంటి కార్యక్రమంలో అలాంటి ప్రశ్న వేయొచ్చా.. నీకు బుద్ధి ఉందా అంటూ లాల్ ఆవేశపడిపోయారు. మామూలుగా చాలా ప్రశాంతంగా కనిపించే మోహన్ లాల్.. ఆ స్థాయిలో ఆగ్రహానికి గురి కావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే లాల్ కోపానికి అర్థం ఉందని ఆయన్ని అందరూ సమర్థించారు. ఐతే తాను ఆగ్రహంలో నోరు జారానని గ్రహించిన లాల్.. కాసేపటి తర్వాత శాంతించారు. ఆ రిపోర్టర్ ను పిలిచి మాట్లాడారు. ఒక అన్నలా తాను మందలించానని భావించాలని.. అంతే తప్ప మరోలా తీసుకోవద్దని చెప్పాడు. ఆయన బహిరంగంగా అందరి ముందు ఆ విలేకరికి క్షమాపణ కూడా చెప్పారు. కోపంలో ఎవరైనా తప్పు చేస్తారు.. కానీ దాన్ని వెంటనే సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం.. సారీ చెప్పడం అందరూ చేయరు. మోహన్ లాల్ స్థాయి వ్యక్తి ఇలా అందరి ముందు సారీ చెప్పడంపై అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు.
Tags:    

Similar News