సినిమా రివ్యూ రాసినందుకు చంపేస్తారట

Update: 2016-10-15 11:30 GMT
ఒక సినిమా మీద ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. ఎవరు ఎలాంటి అభిప్రాయం అయినా వ్యక్తం చేయొచ్చు. అది వాళ్ల భావ ప్రకటన హక్కు. అందులోనూ సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక ఈ హక్కును చాలామంది ఉపయోగించుకుంటారు. సినిమాల మీదే కాక అనేక అంశాలపై ఓపెన్‌ గా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఐతే స్టార్ హీరోల వీరాభిమానులు మాత్రం తమ హీరో సినిమాకు వ్యతిరేకంగా ఎవరు నెగెటివ్ రివ్యూలు రాసినా వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఇది అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నదే. మలయాళంలో బిగ్గెస్ట్ స్టార్ అయిన మోహన్ లాల్ కు భారీ అభిమాన సందోహం ఉంది. గత వారమే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన లాల్ సినిమా ‘పులి మురుగన్’ విషయంలో ఒకావిడ నెగెటివ్ రివ్యూ రాయడం పెద్ద దుమారమే రేపింది. ‘పులి మురుగన్’ మాంచి మసాలా సినిమా. ఎక్కువగా వైవిధ్యమైన సినిమాలు చేసే లాల్.. ఈ సినిమాలో రొటీన్ మాస్ మసాలా కథను ట్రై చేశాడు. ఈ సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి కానీ.. సమీక్షకులు మాత్రం ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు.

నిషా మీనన్ అనే ఆవిడ కూడా ఇలాగే రివ్యూ రాసింది. ఆలిండియా రేడియోలో కథకురాలిగా.. వ్యాఖ్యాతగా.. అనౌన్సర్‌ గా పనిచేస్తున్నన్న నిషా.. ‘పులి మురుగన్’ గురించి తన ఫేస్ బుక్ లో సెటైర్లు గుప్పిస్తూ సమీక్ష రాశారు. ఇది శిఖర్.. నారన్ అనే రెండు సినిమాల్ని కలిపి కొట్టిన కథతో తెరకెక్కిందని.. మసాలాలన్నీ ఐదేసి గ్రాములు.. పది జీపులు.. మోహన్‌ లాల్ ను ఆకాశానికెత్తేసే డైలాగులు.. వంద మంది గూండాలు.. కలిపితే పులి మురుగన్ అని కామెంట్ చేసింది. ఆమెకు ఫేస్ బుక్ లో ఫాలోవర్లు కొంచెం ఎక్కువే. ఐతే తమ హీరో సినిమా గురించి నెగెటివ్ ప్రచారం చేస్తోందంటూ మోహన్ లాల్ అభిమానులు ఆమెపైకి దండెత్తారు. బండ బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. ఆమె పోస్టుపై ఏకంగా 4500 కామెంట్లు వచ్చాయి. నిషాను.. ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ కూడా కొందరు బెదిరించారు. ముందు వీళ్లకు భయపడ్డ నిషా.. ఆ తర్వాత వాళ్లపై ఎదురుదాడి చేస్తూ పోస్టు పెట్టింది. ఈ అంశం ప్రస్తుతం కేరళలో చర్చనీయాంశం అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News