26 ఏళ్ల వ‌య‌సుకే క్యాన్స‌ర్ తో న‌టుడు మృతి

Update: 2020-05-24 04:10 GMT
వ‌రుస మ‌ర‌ణాలు బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. ట్యాలెంటెడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ .. ఆ త‌ర్వాత వెట‌ర‌న్ స్టార్ రిషీ క‌పూర్ మ‌ర‌ణాల‌తో ముంబై ప‌రిశ్ర‌మ మూగ‌వోయింది. తాజాగా యువ నటుడు మోహిత్ బఘెల్ క్యాన్సర్ తో ప్రాణాలు విడిచారు. 26 ఏళ్ల చిన్న వ‌య‌సులో అత‌డు మ‌ర‌ణించ‌డం సాటి తార‌ల్లో విషాదం నింపింది. నేటి ఉదయం ఉత్తరప్రదేశ్ లోని మధురలో మోహిత్ మరణించినట్లు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ రాజ్ శాండిల్య తెలిపారు.

రాజ్ శాండిల్య హిందీలో ట్వీట్ చేస్తూ, ``మోహిత్ నా సోదరుడు. ఆస్ప‌త్రి నుంచి వేగంగా కోలుకొని తిరిగి రావాల‌ని కోరుకున్నాను. మీరు తిరిగి వచ్చిన తర్వాతే తిరిగి పని ప్రారంభిస్తాం.. `` అని ట్వీట్ చేసారు. అయితే ఈలోగానే మోహిత్ మ‌ర‌ణ‌వార్త విన్న అనంత‌రం శాండిల్య షాక్ కి గుర‌య్యారు. ``మోహిత్..చాలా పిన్న‌ వయసులో కన్నుమూశాడు. డిసెంబ‌ర్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ కి చికిత్స పొందుతున్నాడు. ఇదివ‌ర‌కూ మాట్లాడినప్పుడు.. ఆరోగ్యంగానే ఉన్నాడు. పూర్తిగా కోలుకుంటున్నాడు కూడా.. అతని తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి మధురలో ఉంటున్నాడు. ఈ మ‌ర‌ణ‌వార్త విని త‌ట్టుకోలేక‌పోయాను`` అని రాజ్ శాండిల్య వెల్లడించారు. 

సంతోషంగా.. సానుకూలంగా ఉంటూ సెట్లో అంద‌రినీ ఎల్లప్పుడూ ప్రేరేపించే అరుదైన న‌టుడు. లవ్ యు మోహిత్. RIP అంటూ ప‌రిణీతి ఆవేదన వ్య‌క్తం చేశారు. జ‌బారియా జోడీ చిత్రంలో ప‌రిణీతితో క‌లిసి మోహిత్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. సిద్దార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ వార్త వినగానే నిజంగా షాక్ అయ్యాను .. మోహిత్ అంత చిన్నవాడు, సంతోషంగా.. ఫన్నీ గా ఉంటాడ‌. టాలెంటెడ్ న‌టుడు. మేమిద్దరం కలిసి మొత్తం సినిమా చేసేశాం... అని తెలిపాడు.

మోహిత్ మరణ వార్త తెలియడంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కామెడీ సర్కస్- జ‌బారియా జోడి-డ్రీమ్‌ గర్ల్ వంటి చిత్రాల్లో న‌టించిన అత‌డు స‌ల్మాన్ ఖాన్ సినిమా రెడీలోనూ న‌టించాడు.  మోహిత్ బాగెల్ 7 జూన్ 1993 న ఉత్తరప్రదేశ్ లోని మధురలో జన్మించారు. చోట్ మియాన్ అనే కామెడీ షోతో కెరీర్ ప్రారంభించారు. నటుడిగా ఎదుగుతున్నాడు. ఇటీవల సిద్దార్థ్ మల్హోత్రాతో మరో సినిమా షూటింగ్ పూర్తి చేశారు.



Tags:    

Similar News