పండ‌గొస్తే థియేట‌ర్ల కొట్లాట!?

Update: 2019-01-03 05:20 GMT
పండ‌గ‌లు, ప‌బ్బాలు వ‌స్తే  థియేట‌ర్ క్యూలో మాస్ జ‌నం కొట్టుకునేవారు. క్యూలైన్ లో ఒక‌రిమీద ప‌డి ఒక‌రు .. చొక్కాలు చింపుకుని అభిమానులు నానా యాగీ చేసేవారు. అయితే ఈ సీనంతా ఒక‌ప్పుడు. చిరంజీవి- బాల‌య్య కాంపిటీష‌న్ ఇప్పుడు లేనేలేదు. క్యూలైన్ లో నించుకుని చొక్కాలు చింపుకుని అరుచుకోవ‌డాలు అస‌లే లేవు. ఇప్పుడంతా హైటెక్ సిస్ట‌మ్. కొన్ని మాస్ రూర‌ల్, టూటైర్ సిటీస్ వ‌ర‌కూ థియేట‌ర్ల‌ను మిన‌హాయిస్తే ఆల్మోస్ట్ అన్నిచోట్లా ఆన్ లైన్ లో టిక్కెట్లు దొరుకుతున్నాయి. చాలా ముందే బుక్ చేసుకుని ఫ్యామిలీ ఆడియెన్ వెళుతున్నారు. కొన్ని టిక్కెట్ల‌ను థియేట‌ర్ ఓన‌ర్లు, పంపిణీదారులు బ్లాక్ చేసుకుని బ్లాక్ లో విక్ర‌యిస్తున్నారు.

ఇటీవ‌ల టాలీవుడ్ లో కొన్ని ప‌రిణామాలు ప‌రిశీలిస్తే మాస్ స్థానంలో క్లాస్ వ‌చ్చి చేరారు. వీళ్లు థియేట‌ర్ క్యూలో నిల‌బ‌డి టిక్కెట్ల కోసం కొట్టుకోరు. థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసే సినిమాల కోసం కొట్లాట‌కు దిగుతుంటారు. ప్ర‌త్య‌ర్థి పై పోటీప‌డ‌తారు. రేటు పెంచేస్తారు. అవ‌స‌రం అనుకుంటే రాజ‌కీయం చేస్తారు. బిజినెస్ ని పోటీ న‌డుమ ఛేజిక్కించుకునేందుకు చాలానే చేస్తుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా సాగుతున్న క్ర‌తువు అయినా ఇటీవ‌ల ఈ పోటీ ఏమంత ఆరోగ్య‌క‌రంగా లేద‌న్న మాటా ఫిలింఛాంబ‌ర్, నిర్మాత‌ల మండ‌లి ప్ర‌ముఖులే చెబుతున్నారు. ఇది స్ట్రెయిట్ సినిమాల రిలీజ్ హ‌క్కులు అయినా, డబ్బింగ్ సినిమాల రిలీజ్ ల కోసం అయినా టాలీవుడ్ లో నిరంత‌రం సాగే ఒక గేమ్. ఇటీవ‌ల 2.ఓ డ‌బ్బింగ్ రైట్స్ వ్య‌వ‌హారం, న‌వాబ్, సర్కార్, పేట వంటి చిత్రాల డ‌బ్బింగ్ రిలీజ్ హ‌క్కుల కోసం చాలానే పోటీ న‌డిచింది. ఈ పోటీలో పెద్ద మొత్తం వెచ్చించిన వారికి, రిలీజ్ స‌వ్యంగా చేస్తారు! అన్న న‌మ్మ‌కం ఉన్న బిగ్ ఫైనాన్షియ‌ర్లు, పంపిణీదారుల‌కే హ‌క్కుల్ని క‌ట్ట‌బెట్టారు.

అలాగే టాలీవుడ్ లో థియేట‌ర్ల ప‌రంగానూ కొట్లాట ఏమాత్రం ఆగ‌లేదు. ఇది య‌థావిధిగా కొన‌సాగుతోంది. థియేట‌ర్ల ఆట‌లో ధ‌న‌బ‌లం, ప‌వ‌ర్ పాలిటిక్స్ ప్ర‌ముఖంగా వ‌ర్క‌వుట్ అవుతున్నాయి. ఇక్క‌డ‌ బ‌ల‌వంతుడిదే రాజ్యం. సినిమాలు రిలీజ్ చేసేది వాళ్లే. థియేట‌ర్లు ఛేజిక్కించుకుని ఆట ఆడేది వీళ్లే అన్న వాద‌న‌ ఎప్ప‌టి నుంచో ఉంది. ఇక చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌లేదంటూ గ‌గ్గోలు పెట్టేవాళ్లు పెరుగుతున్నారే కానీ, అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం పండ‌గ‌లో థియేట‌ర్లు దొర‌క‌లేదంటూ ర‌జ‌నీ `పేట‌`ను రిలీజ్ చేస్తున్న‌ నిర్మాత గ‌గ్గోలు పెట్ట‌డం చూస్తుంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పండ‌గ‌ల వేళ సెల‌వుల్ని క్యాష్ చేసుకోవాల‌న్న ఆరాటంలో ప‌లువురు నిర్మాత‌లు ఇతరుల‌తో పోటీకి దిగుతున్నారు. అంతేకాదు.. ఒకేసారి నాలుగైదు సినిమాలు రిలీజ్ కి వ‌చ్చేప్పుడు దీనికి నిర్మాత‌ల మండ‌లిలో క‌ట్ట‌డి చేస్తున్నారా? అంటే అలాంటిదేం క‌నిపించ‌డం లేద‌ని ఓ నిర్మాత చెప్పారు.

ఈసారి సంక్రాంతి బ‌రిలో థియేట‌ర్ల కోసం ఓ ముగ్గురి మ‌ధ్య‌ పోటీ నెల‌కొంది. వీళ్ల‌కు తోడు ర‌జ‌నీ సినిమాని పోటీకి దించ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ పోటీలో ర‌జ‌నీ చిత్రానికి థియేట‌ర్లే ద‌క్క‌లేద‌ని తెలుస్తోంది. ఇలాంటి వాతావ‌ర‌ణం కేవ‌లం ఒక్క సంక్రాంతికే కాదు.. ద‌స‌రా, క్రిస్మ‌స్ స‌హా ప్ర‌తి పండ‌గ‌కు త‌ప్ప‌డం లేదు. ఒకేసారి ఏడెనిమిది సినిమాల్ని రిలీజ్ చేయాల్సిన స‌న్నివేశం ఒక్కోసారి ఉంటుంది. ప్ర‌ముఖ ఫైనాన్షియ‌ర్, పంపిణీదారుడు సునీల్ నారంగ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప‌రిస్థితిని స్ట్రీమ్ లైన్ చేయాల్సి ఉంద‌ని వ్యాఖ్యానించారు. పండ‌గ‌ల్లో ఒక‌దానితో ఒక‌టిగా పోటీప‌డ‌డం వ‌ల్ల సినిమాలు దారుణంగా న‌ష్ట‌పోతున్నాయ‌ని, ఈ పోటీని స్ట్రీమ్ లైన్ చేయాల‌ని అన్నారు. అయితే అది నిర్మాత‌లంతా ఒకే తాటిపైకి వ‌చ్చి చేస్తారా? అంటే సందేహ‌మేన‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి.





Full View

Tags:    

Similar News