సురేష్ బాబుది నమ్మక ద్రోహం అంటున్నారు

Update: 2015-07-21 09:23 GMT
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసినట్లే కనిపించాయి కానీ.. ఎన్నికలైన మరుసటి రోజు నుంచే గొడవ మొదలైంది. ఈసారి ఎన్నికల్లో సంచలన ఫలితాలు వస్తాయన్న ప్రచారం జరిగింది కానీ.. వాస్తవానికి అలాంటిదేమీ జరగలేదు. సురేష్ బాబే ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన వర్గీయులే ఎక్కువమంది విజయం సాధించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వర్గం ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు కూడా మద్దతుగా నిలిచినా ఫలితం లేకపోయింది. ఐతే మునుపటితో పోలిస్తే ఈసారి సురేష్ బాబుకు గట్టి పోటీ ఎదురైంది.

ఐతే ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని అంటున్నారు తెలంగాణ నిర్మాతలు. ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని.. తెలుగు ఫిలిం ఛాంబర్ ను రెండుగా విభజిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి మురళీ మోహనరావు, దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. ‘‘ఈసారి ఎగ్జిబిటర్ల విభాగం నుంచి మురళీమోహనరావు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వాల్సింది. కానీ ఎన్నికల నిర్వహణలో లోపాల వల్ల సురేష్ బాబు మాపై గెలిచారు. ఆయన కేవలం 20 ఓట్ల తేడాతో నెగ్గారు. న్యాయంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటే ఉపయోగించాలి. కానీ ఆంధ్ర ప్రాంతానికి చెదిన పది మంది ఒక్కొక్కరు 19 ఓట్ల లెక్కన ఉపయోగించారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్తే ఎన్నికలు చెల్లవని తీర్పు వస్తుంది. కానీ ఆ నిర్ణయం వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అందుకే ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఫిలిం ఛాంబర్ ను రెండుగా విభజించాలి’’ అని అల్లాణి శ్రీధర్ అన్నారు. సురేష్ బాబు నమ్మకద్రోహం, వెన్నుపోటు వల్లే గెలిచారని మరో నిర్మాత మోహన్ గౌడ్ విమర్శించారు. మరి ఈ విమర్శలపై సురేష్ బాబు అండ్ కో ఏమంటుందో చూడాలి.
Tags:    

Similar News