నా ఫ్యాన్స్ కి ఓపిక ఎక్కువ

Update: 2021-11-19 03:59 GMT
వెంకటేశ్ కథానాయకుడిగా ఈ ఏడాది ఏ సినిమా కూడా థియేటర్లకు రాలేదు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయిన తరువాత, చాలా సినిమాలు థియేటర్లకు వస్తూనే ఉన్నాయి. తాము పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో చిన్న సినిమాలు కూడా చాలా సాహసం చేశాయి. అలాంటి పరిస్థితుల్లో వెంకటేశ్ 'నారప్ప' సినిమా థియేటర్లకు వస్తుందని అభిమానులు భావించారు. కానీ ఆ సినిమా ఓటీటీకి వెళ్లడం వాళ్లను చాలా నిరాశపరిచింది. ఆ సిసినిమాకి మంచి రెస్పాన్స్ రావడం వాళ్లను కూల్ చేసింది.

ఇక ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్లకు 'క్యూ' కడుతున్నాయి. విషయమున్న సినిమాలు హిట్ టాక్ తెచ్చేసుకుంటున్నాయి. అందువలన వెంకటేశ్ తాజా చిత్రమైన 'దృశ్యం 2' థియేటర్లకు వస్తుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అమెజాన్ ప్రైమ్ వారు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమ హీరో సినిమా మళ్లీ ఓటీటీలోనే వస్తుండటం పట్ల వెంకటేశ్ అభిమానులు కాస్త అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

ఈ విషయంపై వెంకటేశ్ స్పందిస్తూ .. "నా అభిమానులకు ఓపిక ఎక్కువ .. వాళ్లు పరిస్థితులను అర్థం చేసుకుంటారు. సినిమాల పరంగా నేను తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తారు. నా సినిమాలు ఏ మాధ్యమం ద్వారా విడుదలైనా ఆదరిస్తారు. నా సినిమాలపై పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా నన్ను ప్రోత్సహిస్తారు. ఈ సారికి ఇలా గడిచిపోయింది. 'ఎఫ్ 3' సినిమా మాత్రం థియేటర్లలోనే వస్తుంది. ఈ సినిమాతో వాళ్లకి డబుల్ ట్రీట్ ఇస్తాను" అన్నారు. 'దృశ్యం 3' ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

'దృశ్యం 3' ఉండొచ్చు .. అందుకు కొన్నేళ్ల సమయం పట్టొచ్చు .. నా గెడ్డం ఇంకా నెరిసిపోతుంది .. పిల్లలు ఇంకా పెద్దవాళ్లవుతారు" అంటూ నవ్వేశారు. మళ్లీ మాట్లాడుతూ ... "నేను కూడా ఇదే ప్రశ్నను దర్శకుడు జీతూ జోసెఫ్ ను అడిగాను. 'దృశ్యం 3'కి సంబంధించిన కొంత చర్చ జరిగింది. ఇక 'ఎఫ్ 3' తరువాత ఇంతరవరకూ ఏ కొత్త ప్రాజెక్టును ఒప్పుకోలేదు. తరుణ్ భాస్కర్ తో పాటు మరికొంతమంది దర్శకులు కథలను రెడీ చేస్తున్నారు. ఎవరి కథ నచ్చితే వారితో సెట్స్ పైకి వెళ్లడం జరుగుతుంది" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News