నాగ్ ది ఘోస్ట్.. యాక్షన్ డోస్ ఎక్కువైతే కష్టమే?

Update: 2022-07-16 01:30 GMT
విభిన్నమైన కథాంశాలను తెరపైకి తీసుకువచ్చే అతికొద్ది మంది టాలెంటెడ్ దర్శకుల్లో ప్రవీణ్ సత్తారు ఒకరు. చందమామ కథలు సినిమాతో జాతీయస్థాయిలో అవార్డు రావడంతో అతనికి మంచి గుర్తింపు లభించింది. దీంతో కొంతమంది ప్రముఖ హీరోలు అతనితో సినిమాలు చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అయితే మరి కొందరు మాత్రమే కంటెంట్ నచ్చకపోవడంతో చర్చల దశలోనే కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం జరిగింది.

ఆమధ్య ఈ దర్శకుడు తన స్టైల్ కు భిన్నంగా గుంటూరు టాకీస్ అనే సినిమా చేశాడు. ఆ తర్వాత గరుడవేగ సినిమాతో మాత్రం పరవాలేదు అనే విధంగా మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతని ఫోకస్ మొత్తం ది గోస్ట్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకొని అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగాలని ఫిక్స్ అయ్యాడు.

అయితే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ పై ఇటీవల అతను క్లారిటీ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలో మొత్తంగా 12 యాక్షన్ సీక్వెల్స్ ఉన్నాయంట.

ఇక అందులో ఎనిమిది యాక్షన్స్ సీన్స్ అయితే భారీ స్థాయిలోనే డిజైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ది గోస్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందులో కత్తితో నాగర్జున అలా శత్రువులను నరుక్కుంటు వెళ్లడం రొటీన్ గానే అనిపించింది.

ఒక గూఢచారి పాత్రలో చీకట్లోనే ఉగ్రవాదాన్ని నేలమట్టం చేసే పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే కథలో కంటెంట్ లేకుండా ఒకేసారి 12 రకాల యాక్షన్ సీక్వెన్స్ అంటే ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు అని అక్కినేని అభిమానులు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

కానీ దర్శకుడు ప్రవీణ్ మాత్రం సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సీక్వెల్ పై ఇంకా ఎలాంటి క్లారిటీకి రాలేదు అని సినిమా రిజల్ట్ ని బట్టి ఆ తర్వాత ఆలోచిస్తాను అని ప్రవీణ్ ఒక వివరణ అయితే ఇచ్చాడు.
Tags:    

Similar News