ఈ సినిమా హిట్ తో నాకు అర్థమైన విషయం అదే: నాగచైతన్య

Update: 2021-09-29 07:30 GMT
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నారాయణదాస్ నారంగ్ - రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ వేవ్ తరువాత భారీస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై నాగచైతన్య మాట్లాడుతూ .. "నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఇక్కడ 'లవ్ స్టోరీ' సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తున్నందుకు. కరోనా కారణంగా ఇలాంటి సంతోషాన్ని ... సందడిని చాలా మిస్సయ్యాను. ప్రతి ఫ్రైడే నేను సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఆడియన్స్ ఏమంటారు? క్రిటిక్స్ ఏమంటారు? వాళ్ల రియాక్షన్ ఏంటి? అనేవి చూస్తాను. అలా పరిశీలించి ఆ తరువాత సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను.

నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు సెప్టెంబర్ 24తో వచ్చింది. ఆ రోజు చాలా మేజికల్ గా అనిపించింది. మన తెలుగు సినిమా ఆడియన్స్ కి ఫస్టు థ్యాంక్స్ చెప్పాలి. సినిమా రిలీజ్ చేస్తే థియేటర్స్ కి వస్తారా లేదా? అనే సమయంలో, అందరూ థియేటర్ కి వచ్చి ఆదరించారు. కోవిడ్ తరువాత .. లాక్ డౌన్స్ తరువాత సినిమాను తెలుగువారు ఆదరించినట్టుగా ఎక్కడా ఆదరించలేదు. అందుకు నేను తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.

శేఖర్ గారి కంటెంట్ .. ఆ కంటెంట్ కి ఉన్న గుడ్ విల్ ఎలాంటిదో మరోసారి ప్రూవ్ అయింది. ఒక నటుడిగా శేఖర్ కమ్ముల గారి గురించి నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ సినిమాతో శేఖర్ కమ్ములగారితో నా జర్నీ ఆగిపోకూడదు. ఆయన దర్శకత్వంలో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఉంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ .. అలాగే మీడియా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. రిలీజ్ తరువాత మీరిచ్చిన ఫీడ్ బ్యాక్ ఈ సినిమాకి మరింత సపోర్టును ఇచ్చింది.

నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్ గారు - రామ్మోహన్ రావు గారు ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో అలా హోల్డ్ చేసి ఉంచారు. మీ పట్టుదల కారణంగానే ఈ రోజున ఈ సినిమాను ఆడియన్స్ థియేటర్లలో ఎంజాయ్ చేయగలుగుతున్నారు. నా కో స్టార్స్ .. టెక్నీషియన్స్ ఎంతో సహకరించారు. పవన్ సీహెచ్ సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో హెల్ప్ అయ్యాయి. శేఖర్ కమ్ములగారు .. ఆయన డైరెక్షన్ టీమ్ లోని అంకితభావం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ సినిమా కోసం ఎంతైనా చేయవచ్చని అప్పుడు అనిపించింది.

ఈ సందర్భంగా అభిమానులనులందరికీ నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొత్త కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. హానెస్ట్ గా ఎలాంటి కంటెంట్ తో వచ్చినా మీరంతా సపోర్ట్ చేస్తారనే విషయం నాకు ఈ సినిమాతో అర్థమైంది. ఇంతవరకూ సినిమాను చూడని వారు మీ ఫ్రెండ్స్ తో .. ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి చూడండి. కోవిడ్ కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎనజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.     
Tags:    

Similar News