ఇది సరిపోదు అల్లుడు

Update: 2018-09-18 06:39 GMT
మొన్న పండక్కి విడుదలైన శైలజారెడ్డి అల్లుడు నాలుగు రోజుల పొడవైన వీక్ ఎండ్ ని బాగా వాడుకుని 25 కోట్ల గ్రాస్ తో పాటు 14 కోట్ల షేర్ ని దాటించేసింది కానీ నిన్నటి నుంచి అసలైన అగ్ని పరీక్ష మొదలైంది. మొదటి రోజు వచ్చిన టాక్ కు తగ్గ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రధాన కేంద్రాల్లో మినహాయించి చాలా చోట్ల డ్రాప్స్ నమోదయ్యాయని ట్రేడ్ రిపోర్ట్స్ అందుతున్నాయి. సేఫ్ కావడం గురించి పెద్దగా అనుమానం అక్కర్లేదు కానీ చైతు మార్కెట్ పరిధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉండటం కాస్త ఆందోళన కలిగించే విషయం. ఫైనల్ గా  ఎంత వసూలు చేస్తుందన్నది ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్ ప్రకారం చూసుకుంటే మహా అయితే 20 లేదా 25 కోట్ల మధ్య ఆగిపోతుంది. ఒకపక్క నాని శర్వానంద్ వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఈ మార్క్ దాటేసి 35 నుంచి 40 కోట్ల మధ్యలో రాబట్టి చూపించారు. కానీ నాగ చైతన్యకు మాత్రం ఇది అందని పండులాగే మిగిలిపోతోంది. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అవుతున్నా ఇలా జరగడం అభిమానులకు సైతం రుచించనిదే. గీత గోవిందం లాంటి సింపుల్ ఎంటర్ టైనర్ 60 కోట్ల షేర్ తేగా లేనిది అందులో శైలజారెడ్డి అల్లుడు కనీసం సగం కూడా కష్టమే అంటే ఆలోచించాల్సిన విషయమే.

శైలజారెడ్డి అల్లుడు విషయంలో చైతు వైపు వంక పెట్టడానికి లేదు. తన వైపు నుంచి పూర్తి న్యాయం చేసాడు. దర్శకుడు మారుతీ అవసరానికి మించి మూడేసి పాత్రలకు ఈగోలు పెట్టేసి ఆ ప్రహసనంలో అసలు కథను లైట్ తీసుకోవడం డివైడ్ టాక్ రావడానికి కారణం అయ్యింది. పైగా చాలా క్లీన్ కామెడీతో భలే భలే మగాడివోయ్ లో మెప్పించిన మారుతీ ఇందులో మళ్ళి ప్రాణిక్ హీలింగ్ పేరుతో పృథ్వితో చేయించిన టాయిలెట్ కామెడీ పేలలేదు సరికదా ఇలాంటివి ఎలా రాసుకున్నాడా అనే అనుమానం కలిగించింది. మారుతీ ఇంకోలా మాస్ మెప్పించేలా దీన్ని తీసుంటే పోటీ లేని పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకుని చైతు 30 ప్లస్ క్లబ్ లో జాయిన్ అయ్యేవాడే. ఇప్పటికైతే ఛాన్స్ లేనట్టే. ఈ శుక్రవారం సామీ స్క్వేర్ తో పాటు నన్ను దోచుకుందువటే వస్తున్నాయి. ప్రభావం అయితే ఉండే ఉంటుంది. మరి సవ్యసాచితో అయినా చైతు కోరుకున్న బ్రేక్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
Tags:    

Similar News