అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా?

Update: 2018-08-24 01:30 GMT
‘ఛలో’ చిత్రంతో హీరోగా ఒక మెట్టు పైకి ఎక్కేసిన నాగశౌర్య తాజాగా ‘నర్తనశాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. హోం బ్యానర్‌ లో ఈ చిత్రాన్ని చేసిన నాగశౌర్య మరోసారి సక్సెస్‌ ను దక్కించుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఛలో చిత్రం విషయంలో  అనుసరించిన విధంగానే ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌ తో నిర్మించడంతో పాటు - పెద్ద ఎత్తున సినిమాకు పబ్లిసిటీ చేయడం జరిగింది. దాంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగశౌర్య తల్లి ఉష మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రాన్ని మొదటి నుండి టెన్షన్‌ పెడుతూ వస్తున్న శైలజ రెడ్డి అల్లుడు చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడటంతో మాంచి జోష్‌ తో విడుదల కాబోతుంది.

‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని ఈనెల 31న అంటే ‘నర్తనశాల’ విడుదలైన తర్వాత రోజే విడుదల చేయాలని మారుతి భావించాడు. కాని కేరళలో వరదల కారణంగా రీ రికార్డింగ్‌ వర్క్‌ పూర్తి కాలేదు. దాంతో సినిమాను వాయిదా వేయడం జరిగింది. శైలజ రెడ్డి అల్లుడు విడుదల వాయిదా పడటం వల్ల నాగశౌర్య మూవీకి భారీ ఓపెనింగ్స్‌ దక్కే అవకాశం ఉంది. ఖచ్చితంగా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు నమోదు అవుతాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలు పెద్దగా అంచనాలు కలిగి లేవు. అంటే నర్తనశాలకు పెద్దగా పోటీ ఉండదు.

ఎలాంటి పోటీ లేకుండా, ఒత్తిడి లేకుండా విడుదల కాబోతున్న నర్తనశాల ప్రస్తుతం సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తుంది. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగశౌర్య గే గా కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది. ‘ఛలో’ సినిమా తరహాలో ఇదో కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన టీజర్‌ తో తేలిపోయింది. నాగశౌర్య కెరీర్‌లో ఇది మరో సక్సెస్‌గా నిలిచి మరో మెట్టు ఎక్కడంలో ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదల వాయిదాను నాగశౌర్య సద్వినియోగం చేసుకుని మంచి వసూళ్లను రాబడుతాడా లేదా అనేది చూడాలి. నర్తనశాల విడుదలైన తర్వాత రోజు ‘పేపర్‌ బాయ్‌’ విడుదల కాబోతుంది. ఆ సినిమాకు పెద్దగా క్రేజ్‌ లేదు. కనుక నర్తనశాల ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా వారం రోజుల పాటు కలెక్షన్స్‌ దున్నేయవచ్చు.
Tags:    

Similar News