ఇలాంటివేళలోనూ.. వేడుకల్ని నిర్వహించటమా?

Update: 2022-01-10 04:14 GMT
నిజమే.. తరచి చూస్తే కమిట్ మెంట్ కు మించిన కఠినమైనది మరొకటి ఉండదేమో. మనిషికి మించిన భావోద్వేగాలు మరెవరికీ ఉండవని చెబుతారు. కానీ.. కొన్ని సందర్భాల్లో గుండెల్లో తన్నుకొచ్చే బాధ ఉన్నప్పటికీ.. చుట్టూ ఉన్నోళ్లంతా ఏమనుకుంటారన్న విషయాన్ని వదిలేసి.. తాము ఇచ్చిన కమిట్ మెంట్ కోసం పని చేయాల్సి వస్తుంది.

ఇదెంత ఇబ్బందికరమన్ని ఆదివారం నాటి టాలీవుడ్ లో నిర్వహించిన వేడుక ఒకటి చెప్పేసింది. సంక్రాంతి రేసులోకి అనూహ్యంగా వచ్చిన బంగార్రాజు మూవీ మ్యూజికల్ ఈవెంట్ ను ఆదివారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. కళ్యాణ్ కృష్ణ  దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ కమ్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కింగ్ నాగార్జున హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ ఈ వారం విడుదల కానుంది. జనవరి 14 రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన వేడుకను ఆదివారం రాత్రి నిర్వహించారు.

శనివారం రాత్రి అనూహ్యంగా సూపర్ స్టార్ క్రిష్ణ పెద్ద కుమారుడు కమ్ నటుడిగా ఒకప్పుడు వ్యవహరించి.. ప్రస్తుతం నిర్మాతగా ఉన్న రమేశ్ బాబు అనారోగ్యంతో మరణించటం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సాధారణంగా.. ఇండస్ట్రీకి చెందిన వారు మరణిస్తే.. ఆ రోజున ఉన్న కార్యక్రమాల్ని.. వేడుకల్ని వాయిదా వేస్తారు.

రమేశ్ బాబు మరణం నేపథ్యంలో బంగార్రాజు మ్యూజికల్ వేడుకను వాయిదా వేయాల్సి ఉంది. కానీ.. బిజినెస్ కమిట్ మెంట్ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో.. ఆ వేడుకను నిర్వహించక తప్పలేదు. ఎందుకంటే.. ఈ వేడుక బిజినెస్ కమిట్ మెంట్ లో ఒక భాగం. దాన్ని నిర్వహించకపోతే.. జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే.. షెడ్యూల్ ప్రకారం.. మ్యూజికల్ ఈవెంటను నిర్వహించక తప్పని పరిస్థితి.

ఎంత కమిట్ మెంట్ అయితే మాత్రం.. మనషులు.. మనసుల కన్నా ఎక్కువా? అన్న ప్రశ్న వస్తుంది కానీ.. అదంతా బిజినెస్.. నెంబర్ గేమ్ మధ్య నడిచినప్పుడు మాత్రం.. కొన్నింటిని పట్టించుకోనట్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. బంగార్రాజు టీం ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొందని చెప్పాలి.

ఇండస్ట్రీకి చెందిన తోటి మనిషి మరణించిన వేళ.. వేడుకను నిర్వహించటమా? అంటే.. విడుదలకు కేవలం మరో ఐదు రోజలు మాత్రమే గ్యాప్ ఉండటం.. ఇప్పుడు కాకుంటే.. మరిక సాధ్యం కాదన్న వేళ.. పోయిన ప్రాణం ఎటూ పోయింది.. చూస్తూ.. చూస్తూ.. వ్యాపారాన్ని పోగొట్టుకోలేం కదా? అన్నట్లుగా వేడకను నిర్వహించక తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి.. కమిట్ మెంట్ కు మించిన కఠినమైనది ఇంకేం ఉంటుంది.
Tags:    

Similar News