బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీలో నాగ్

Update: 2018-07-10 05:57 GMT
టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి బాలీవుడ్ కు వెళుతున్నారు.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హిందీ జనాలను పలకరించబోతున్నాడు. కరణ్ జోహర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘బ్రహ్మస్త్ర’ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ - రణ్ బీర్ కపూర్ - అలియాభట్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ లో రీఎంట్రీ కోసం చాలా కాలంగా నాగార్జున ఎదురుచూస్తున్నారు. బ్రహ్మస్త్ర దర్శకుడు మంచి రోల్ తో సంప్రదించడం.. కథ కూడా నాగార్జునకు నచ్చడం.. పైగా తాను ఎంతో ఇష్టపడే అమితాబ్ కూడా నటిస్తుండడంతో నాగార్జున వెంటనే ఈ హిందీ సినిమాకు ఓకే చెప్పాడని ప్రముఖ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. ముంబైలో జరగబోయే షెడ్యూల్ లో నాగార్జున పాల్గొంటాడని కథనంలో పేర్కొన్నారు.

నాగార్జున ఇదివరకూ ఖుదా గవా - క్రిమినల్ - జక్మ్ తదితర హిందీ చిత్రాల్లో నటించాడు. 2003లో ఎల్ వోసీ పేరుతో కార్గిల్ యుద్ధ నేపథ్యంలో వచ్చిన హిందీ చిత్రంలోనూ నటించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నాగార్జున హిందీ సినిమాల్లో నటిస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం నాగార్జున మల్టీస్టారర్ సినిమాలో నానితో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దేవదాస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Tags:    

Similar News