మహాభారతం.. అమీర్‌ఖాన్ భయం ఇదే!
ప్రస్తుతం తారే జమీన్ పర్ సీక్వెల్- సితారే జమీన్ పర్ ని ఈ వేసవిలో విడుదల చేసేందుకు సిద్ధమైన అమీర్ ఖాన్.. మహాభారతం స్క్రిప్టు పై పని చేస్తున్నట్టు ప్రకటించారు.;
అమీర్ ఖాన్ `మహాభారతం`ను వెండితెరకెక్కించేందుకు సిద్ధమవుతుంటే అభిమానుల్లో చాలా సందేహాలు నెలకొన్నాయి. అతడు తన 60వ పుట్టినరోజు వేడుకల్లో తన మూడో భార్యను పరిచయం చేస్తూనే, డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ప్రారంభిస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం తారే జమీన్ పర్ సీక్వెల్- సితారే జమీన్ పర్ ని ఈ వేసవిలో విడుదల చేసేందుకు సిద్ధమైన అమీర్ ఖాన్.. మహాభారతం స్క్రిప్టు పై పని చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే అమీర్ ఖాన్ హిందూ ఇతిహాసం `మహాభారతం` మీద సినిమా తీయాలంటే చాలా ఆటంకాలు ఎదురవుతాయని అంతా ఊహిస్తున్నారు. మహాభారతం అపరిమితమైన అసాధారణమైన పురాణేతిహాసం. మొత్తం కథాంశానికి న్యాయం జరిగేలా పెద్ద తెర కోసం వరుస సినిమాలు తీయాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటి పరిస్థితుల్లో 1000 కోట్లు పైగానే బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. నాలుగైదేళ్ల క్రితం మహాభారతం తెరకెక్కించాలంటే, వాణిజ్యపరంగా లాభదాయకం కాకపోవడంతో అమీర్ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనాలొచ్చాయి. సాధకబాధకాలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత అమీర్ ఖాన్ మహాభారతం తీయకూడదని నిర్ణయించుకున్నాడు.
అయితే సాధకబాధకాల్లో ఒక ముఖ్యమైన అంశం మనోభావాలు దెబ్బ తినడం. ఒక హిందూ ఎపిక్ మీద ముస్లిమ్ అయిన అమీర్ ఖాన్ సినిమా తీస్తే అది ఎలాంటి వివాదాలను మోసుకొస్తుందోననే ఆందోళన అతడిలో ఉంది.
పైగా ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదమవుతుందని కూడా అమీర్ ఊహించాడు. అందుకే అప్పట్లో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా అతడు ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసిన స్థాయి వాణిజ్యపరంగా లాభదాయకం కాదు. అలాగే, తన విలువైన సమయంలో ఐదు సంవత్సరాలు మహాభారతం కోసం కేటాయించడం అంటే కనీసం మూడు- నాలుగు సినిమాలతో వచ్చే ఆదాయాన్ని కోల్పోవడమే. అంత మొత్తం సమయాన్ని కూడా కేటాయించాలి. కాబట్టి మహాభారతం ప్రణాళిక అంత సులువు కాదని అమీర్ ఖాన్ గ్రహించాడు. కానీ ఇప్పుడు మొండి పట్టుదలతో బరిలో దిగుతున్నాడని అర్థమవుతోంది. లింగుస్వామి లాంటి ఒక సౌత్ దర్శకుడు మహాభారతం క్రెడిట్ ని కొట్టేయడం కూడా అమీర్ ఖాన్ కి ఇష్టం లేదేమో! అందుకే ఇంత హుటాహుటీన ప్రకటించాడు.