నిర్మాతకు భారం తగ్గించే ఫార్ములా -నమ్రత

Update: 2015-07-23 07:27 GMT
భారీ బడ్జెట్‌ లతో నిర్మాతకి గుండు బొప్పి కట్టేస్తున్న తరుణమిది. కాస్ట్‌ కంట్రోల్‌ అనేది పెద్ద సమస్య అయిపోయింది. హీరో, డైరెక్టర్ల పారితోషికాలు చెల్లించడానికే ఉన్నదంతా ఊడ్చి పెట్టాల్సొస్తోంది. అయితే ఇలాంటి బాధే లేకుండా ఓ చిట్కా కనిపెట్టేశానని చెబుతున్నారు నమ్రత మహేష్‌. అదేంటో వివరంగా చూద్దామా?

ఓ స్టార్‌ హీరో సినిమాకి 50కోట్ల బడ్జెట్‌ అనుకుంటే అందులో 30కోట్లు హీరో, డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌ కే పోతోంది. ఆ డబ్బు సర్ధాలంటే బోలెడంత తతంగం. అదే ఆ సినిమాలో నటిస్తున్న స్టార్‌ హీరో కోప్రొడ్యూసర్‌ గానో లేక సమర్పకుడిగానో పనిచేస్తే, అతడు పుచ్చుకునే పారితోషికమే పెట్టుబడిగా మారితే ఇక అప్పుడు నిర్మాతకి కష్టం ఏం ఉంటుంది? అందుకే మేం జి.మహేష్‌ బాబు ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ బ్యానర్‌ ప్రారంభించాం. ఇక మహేష్‌ నటించే సినిమాలన్నిటికీ ఈ బ్యానర్‌ కోప్రొడ్యూస్‌ చేస్తుంది.. అని నమ్రత చెప్పుకొచ్చారు.

ఇక నుంచి నేరుగా ఫిలింమార్కెట్‌ లోకి ప్రవేశించినట్టే అని తెలుపుతూ.. బాలీవుడ్‌ లో షారూక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ లాంటి హీరోలు అనుసరిస్తున్న పద్ధతి ఇదే. స్వయంగా సొంత బ్యానర్‌ లు ప్రారంభించి సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పద్ధతి వల్ల నిర్మాతకి లిక్విడ్‌ సమస్య తలెత్తదు. స్వేచ్ఛగా కంటెంట్‌ పై పెట్టుబడులు పెట్టడం కుదురుతుందని నమ్రత ఈ సందర్భంగా డీటెయిలింగ్‌ ఇచ్చారు. ఇలా హీరోనే పెట్టుబడులు పెట్టడం వల్ల నిర్మాతకు కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది. మేం మీతోనే ఉన్నాం అన్న హామీ ఉంటుంది. ఆ తర్వాత లాభాల్లోంచి వాటా తీసుకోవచ్చు... అని చెప్పుకొచ్చారు ఆమె.

ఇకపోతే ఈ సినిమా విషయంలో తాను అందరూ అనుకున్నట్లు ప్రొడక్షన్‌ లో వేలు పెట్టేయలేదని.. కేవలం మార్కెటింగ్‌ పనులు మాత్రమే చూసుకుంటున్నాని తెలిపారు. మళ్ళీ ముఖానికి ఏమైనా రంగేసుకుంటారా అంటే.. అబ్బే కష్టం అంటూ ముగించారు నమ్రత.
Tags:    

Similar News