నాకేదైనా జరిగితే నానా పటేకర్ బాలీవుడ్ మాఫియా బాధ్యత వ‌హించాలి!

Update: 2022-07-30 12:40 GMT
2019లో మీటూ ఉద్య‌మం స్ఫూర్తితో ప్ర‌ముఖ న‌టుడు నానా ప‌టేక‌ర్ పై తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో సంచ‌ల‌నం సృష్టించారు న‌టి త‌నూశ్రీ ద‌త్తా. త‌న‌ని నానా వేధించార‌ని ఆరోపించిన అనంత‌రం అత‌డిపై పోలీస్ ఇన్వెస్టిగేష‌న్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్ల నాటి ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్థావిస్తూ త‌నూశ్రీ ఈ ఆరోప‌ణ‌లు చేసారు. చివ‌రికి చాలా రోజుల పాటు సాగిన విచార‌ణ అనంత‌రం నానా ప‌టేక‌ర్ నిర్ధోషిగానే బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ తీర్పుపై చాలా సార్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న నైరాశ్యాన్ని వ్య‌క్తం చేసారు త‌నూశ్రీ‌.

ఇదిలా ఉంటే త‌నూశ్రీ స‌డెన్ గా ఇచ్చిన తాజా స్టేట్ మెంట్ వెబ్ లో హీట్ పుట్టిస్తోంది. ``నాకేదైనా జరిగితే నానా పటేకర్ బాలీవుడ్ మాఫియా బాధ్యత వహించాలి`` అని తనుశ్రీ దత్తా తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది. నానా పటేకర్ అతని బాలీవుడ్ మాఫియా స్నేహితుల చిత్రాలను బహిష్కరించాలని తన అభిమానులను త‌నూశ్రీ ఇన్ స్టా వేదిక‌గా అభ్యర్థించింది.

పరిశ్రమలో #MeToo ఆరోపణల పరంపరకు తెరలేపుతూ నానా పటేకర్ తో పాటు సినీ వర్గానికి చెందిన మరికొందరు తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం పాఠకులకు తెలిసిందే. తాజాగా మ‌రోసారి బాలీవుడ్ కు చెందిన కొంద‌రు వ్యక్తులు తనను వేధిస్తున్నారని త‌న‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో వ‌రుస సందేశాల‌ను పోస్ట్ చేస్తున్నారు. దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో వారి ప్రమేయం ఉందని కూడా త‌నూశ్రీ‌ ఆరోపించారు.

మ‌రింత వివ‌రంగా త‌నూశ్రీ నోట్ ని ప‌రిశీలిస్తే దాని సారాంశం ఇలా ఉంది. ``నాకు ఏదైనా జరిగితే #metoo నిందితుడు నానా పటేకర్.. అతని లాయర్లు & సహచరులు .. అతని బాలీవుడ్ మాఫియా స్నేహితులే బాధ్యులని తెలియజేయండి! బాలీవుడ్ మాఫియా ఎవరు ?? ఎస్‌.ఎస్‌.ఆర్‌ మృతి కేసులో వారి పేర్లన్నీ తరచూ తెరపైకి వచ్చినవారే. అందరికీ ఒకే క్రిమినల్ లాయర్ ఉన్నారని గమనించండి`` అని పోస్ట్ చేశారు.

``వారి (నానా అండ్ మాఫియా) సినిమాలను చూడకండి. వాటిని పూర్తిగా బహిష్కరించండి. దుర్మార్గపు ప్రతీకారంతో వారిని వెంబడించండి. దుర్మార్గపు ప్రచారాల వెనుక నా గురించి .. నా PR వ్యక్తుల గురించి కూడా నకిలీ వార్తలను ప్ర‌చారం చేసిన పరిశ్రమ ముఖాలు & జర్నలిస్టులందరినీ వెంబడించండి. అందరినీ అనుసరించండి !!`` అని ఒక నోట్ లో పేర్కొన్నారు. ``నన్ను చాలా వేధించినందుకు వారి జీవితాలను నరకయాతనకు గురి చేయండి! చట్టం & న్యాయం నా విష‌యంలో విఫలమై ఉండవచ్చు. కానీ ఈ గొప్ప దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. జై హింద్...అండ్ బై! ఫిర్ మైలేంగే...`` అంటూ ఘాటైన ప‌ద‌జాలంతో వ‌రుస పోస్టింగులు చేసారు.

ఈ నెల ప్రారంభంలో కూడా తనుశ్రీ దత్తా ఇన్ స్టాగ్రామ్ లో కొంద‌రు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని తన బాలీవుడ్ కెరీర్ ను నాశనం చేశారని ఆరోపించారు. బాలీవుడ్ మాఫియా.. మహారాష్ట్రలోని పాత పొలిటిక‌ల్ స‌ర్కిల్ నేత‌లు.. నీచమైన జాతీయ నేరస్థులు తనకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.





Full View
Tags:    

Similar News