టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా ఇండస్ట్రీ గురించి మాట్లాడారా...?

Update: 2020-06-11 09:50 GMT
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కోరుతూ టాలీవుడ్ సినీ ప్రముఖుల బృందం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి టాలీవుడ్ తరపున స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు - సురేష్ బాబు - సి కళ్యాణ్ - పీవీపీ - డైరెక్టర్ రాజమౌళి తదితరులు సీఎం వైఎస్ జగన్‌ ని కలిసిన వారిలో ఉన్నారు. ఈ భేటీలో సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అన్ని విధాలా ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేసారని చిరంజీవి వెల్లడించారు. అయితే ఇప్పటికే ఇండస్ట్రీ మీటింగ్స్ కి నన్ను పిలవలేదంటూ అసహనం వ్యక్తం చేసిన సీనియర్ హీరో నందమూరి బాలయ్య ఏపీ సీఎం జగన్ తో భేటీలో కూడా కనిపించలేదు. బాలయ్య షష్ఠి పూర్తి వేడుకలు ఉండటం వలన రాలేకపోతున్నానని చెప్పాడని ఇండస్ట్రీ ప్రముఖులు వెల్లడించారు.

కాగా ఇండస్ట్రీ పెద్దలు ఏపీ సీఎంతో భేటీ అవడంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో బాలయ్య స్పందించారు. సీఎం జగన్ తో మీటింగ్ కోసం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారని.. అతడితో పాటు మరికొందర్ని రమ్మని ఒక లిస్ట్ ఇచ్చారని.. ఒక వ్యక్తి కి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు తను ఎందుకు వెళ్తానని.. ఇండస్ట్రీ అంటే ఒక్కరు కాదని.. ఇండస్ట్రీ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఫిలిం ఛాంబర్ కి అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు బాలయ్య. అంతే కాకుండా నేను అలోచించి చెపుతా అన్నాను.. కానీ అంత లోనే తన ప్రమేయం లేకుండానే పుట్టినరోజు ఉండటం వలన సమావేశానికి బాలయ్య రాడంటూ వాళ్లకు వాళ్లే ప్రకటించేశారని.. నా వాయిస్ నా ప్రమేయం లేకుండా ఎలా చెప్తారు.. నేను హర్ట్ అయ్యాను.. అందుకే నేను తర్వాత వారు నాతో మాట్లాడటానికి ట్రై చేసినా స్పందినలేదని వెల్లడించారు.

అంతేకాకుండా విశాఖలో సినీ పరిశ్రమను నెలకొల్పాలని అనుకోవడం తప్పు కాదు. కానీ ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడం మాత్రం సరికాదన్నారు. విశాఖలో స్టుడియో ఏర్పాటుకు అనుమతి కావాలంటూ అందరికంటే ముందు గత ప్రభుత్వంలోనే తాను అప్లికేషన్ పెట్టుకున్నానని.. ఇప్పటికీ ఆ అప్లికేషన్ ఏఫ్డీసీలో పడుందని.. అలాంటప్పుడు ఎవరో ఒకరికి ఆ క్రెడిట్ ఇస్తే ఒప్పుకోనంటూ వ్యాఖ్యానించారు బాలయ్య. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమ అభివృద్ధి గుర్తు రాలేదా.. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు.. అప్పుడు ఇండస్ట్రీ గురించి ఎవరైనా మాట్లాడారా.. అప్పట్లో ఇండస్ట్రీ గురించి కాస్తో కూస్తో ఆలోచించింది నేను.. నేనే పట్టుబట్టి ప్రభుత్వంతో నంది అవార్డ్స్ అనౌన్స్ చేపించాను అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ లో గ్రూపులు ఎక్కువయ్యాయని.. మరీ ముఖ్యంగా కుల సమీకరణాలు పెరిగిపోయాయని విమర్శించిన బాలకృష్ణ ఇండస్ట్రీకి రకరకాల రంగులు పులుముతున్నారని.. అది మంచిది కాదని.. రాజకీయ కారణాలతోనే నన్ను మీటింగులకు పిలవలేదని అనుకుంటున్నానని విమర్శలు చేసారు బాలయ్య.
Tags:    

Similar News