ఎన్టీఆర్ 21వ వర్ధంతి.. ఘననివాళి!

Update: 2017-01-18 09:39 GMT
బుధవారం ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురష్కరించుకుని హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ - కళ్యాణ్‌ రామ్‌ - లక్ష్మీ పార్వతి - భువనేశ్వరి - బ్రహ్మణి ఇతర కుటుంబ సభ్యులు - తెలుగుదేశం పార్టీ నేతలు మొదలైనవారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ... ఎన్టీఆర్ నింగికేగి ఇన్ని ఏళ్లైనా ఆయన నటనా వైభవం మదిలోనే మెదలుతోందని, తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని అన్నారు. నటుడిగా ఆయన వెదజల్లిన వెలుగు నేటికీ కొనసాగుతోందని, నట నర్సింహుడైన ఆయన మన గుండెల్లో మెండుగా ఉంటాడని బాలయ్య అన్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేశారని.. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని చెప్పారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్‌ కు భారతరత్న ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మరోసారి బాలయ్య చెప్పారు.

మహానుభావులు మనల్ని భౌతికంగా విడిచివెళ్లిపోయినా.. వారు చేసిన మంచి పనులు మన చుట్టూనే ఉంటాయని చెప్పారు జూ. ఎన్టీఆర్. తాత ఆత్మ తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలోనే ఉంటుందని, ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని యంగ్ టైగర్ తెలిపారు. తమకు ఆయన చూపిన మంచి మార్గాన్ని నిత్యం అనుసరిస్తూ, ఆయన ఆశయాలతోనే ముందుకు సాగుతామని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన చల్లని చూపు రెండు తెలుగురాష్ట్రాలపై ఎల్లప్పుడు ఉంటుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరికృష్ణ... తన సంస్కరణల ద్వారా రాష్ట్ర దిశనే కాదు, దేశ దిశను కూడా మార్చిన మహా మనిషి నందమూరి తారకరామారావు అని కొనియాడారు. పురుషులతో పాటు మహిళలకూ ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనత ఆ మహానుభావుడికే దక్కుతుందని చెప్పిన హరికృష్ణ.. ఆయన ఆశయ సాధనకై ముందుకు వెళ్తామని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News