హరికృష్ణ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

Update: 2018-08-30 11:23 GMT
ఒక తార రాలిపోయింది.. ఓ దిగ్గజం అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో హరిక్రిష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిసిపోయాయి. ఇక హరికృష్ణ అంటే ఓ జ్ఞాపకం.. సినిమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన హరికృష్ణ ఇలా అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో అసువులు బాస్తారని ఎవ్వరూ ఊహించలేదు. హరికృష్ణ మరణించినా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అలవాట్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన రోజువారీగా ఏం చేస్తారు.. ఏం తింటారు.? ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కడికెళతారు? ఆయన రోజువారి దినచర్య గురించి ఒక్కసారి పరిశీలిస్తే..

*హరికృష్ణ రోజువారీ జీవితం ఉదయం 3 గంటలకు మొదలయ్యేది. అప్పటి నుంచి ఆయన క్రమపద్ధతిలో రోజు దినచర్య కొనసాగేది.

*కాలకృత్యాలు తీర్చుకున్నాక ఉదయం 6 గంటలకు ఆయన హరికృష్ణ కు అబిడ్స్ లో ఉన్న ఆహ్వానం హోటల్ కు చేరుకునేవారు. హోటల్ గదికి చేరుకునే ముందు  ఎదురుగా ఉండే వినాయకుడికి పూజలు చేయడం హరికృష్ణకు అలవాటు. ఆ హోటల్ లోని 1001 రూమ్ ఎవరికీ ఇచ్చేవారు కాదట.. కేవలం ఆయన ఉండడానికే ప్రత్యేకంగా సిబ్బంది ఏర్పాటు చేసేవారట.. ఆయన అందులోనే కీలక నిర్ణయాలు తీసుకునే వారు. హోటల్ లోని గదిలో కాసేపు దినపత్రికలన్నీ చదివి.. సేదతీరేవారు.

* హరికృష్ణ కు గత 17 ఏళ్లుగా వ్యక్తిగత సహాయకుడిగా రమణయ్య అనే వ్యక్తి ఉంటున్నాడు. ఆయన హరికృష్ణ తాగే కాఫీలో చక్కెర నుంచి ఆయన మధ్యాహ్నం భోజనం.. టైంకి మందులు అవన్నీ చూసుకునేవారు.  

*ఆహ్వానం హోటల్ లో ఉండే హరికృష్ణ ఉదయం  పక్కనే ఉన్న టీటైమ్ హోటల్ నుంచి ఇడ్లీ ని రమణయ్యతో తెప్పించుకునేవారు. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో కొద్దిమందితో సమావేశమయ్యేవారు. ఆ తర్వాత భోజనం చేసేవారు. బీపీ, షుగర్ కు సంబంధించిన మందులు వేసుకొని కాసేపు టీవీ చూడడం ఆయనకు అలవాటు.

*హరికృష్ణకు జంతువులంటే మహా ఇష్టం. అందుకే ఆయన ఆహ్వానం హొటల్ ఎదుట ప్రత్యేకంగా ఓ షెడ్డు ఏర్పాటు చేసేవాడు. అందులో ఆవు.. రామచిలుక, కోళ్లు, కుందేళ్లు పెంచేవారు.. వాటికి ఆహారం, నీళ్లను ప్రతిరోజు ఏర్పాటు చేసేవారు.

* తాను పెంచుకుంటున్న ఆవుకు అప్పుడప్పుడు పూజలు చేయడం.. లేదంటే వనస్థలిపురం లో ఉన్న గోశాలకు వెళ్లి గోవులకు పూజలు చేసి అక్కడ గడుపుతూ సేదతీరేవారు.

* ఇక రాత్రి పడుకునే ముందుకు అరలీటర్ జెర్సీ ఆవు పాలు తాగడం హరికృష్ణకు ఉన్న అలవాటు. ఒక వేళ ఒత్తిడిలో ఉంటే అబిడ్స్ లోని కేఎఫ్ సీ నుంచి చికెన్ లాలీపాప్ లు, పాపాజి దాబా నుంచి తందూరీ చికెన్ తెప్పించుకునే వారు.

*ప్రతి సోమవారం సాయంత్రం నిమ్మకాయలు, నాలుగు కొబ్బరికాయలు, పూజాసామగ్రి తెప్పించి ఇంటికి తీసుకెళ్లేవారు. ఇంటికి వెళ్లే ప్రతిరోజూ ‘రమణయ్య నేను వెళుతున్నా.. జాగ్రత్త’ అని ఆప్యాయంగా చెప్పి వెళ్లడం హరికృష్ణకు అలవాటు.

*నాలుగేళ్ల క్రితం కొడుకు జానకీరామ్ మరణం తర్వాత ఆవేదనలో కృంగి కృశించిపోయి హరికృష్ణ మూడు నెలల పాటు ‘ఆహ్వానం’ హోటల్ కు రాలేదట.. ఆ టైంలో మూగజీవాల ఆలనాపాలనా చూసేందుకు ఇబ్బందిగా ఉందని ఆవును గోశాలకు.. మిగిలిన పక్షులను జూపార్క్ కు తరలించారు.

*ఇక హరికృష్ణ వెంట ఎప్పుడూ రాయల్ ఎన్ ఫీల్డ్ ఉండేది. సీతయ్య సినిమాలో వాడిన ఆ బైక్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు అబిడ్స్ లో దానిపై చక్కర్లు కొట్టేవారు. పాన్ షాప్ కు వెళ్లి పాన్.. మిగిలిన వస్తువులు కొనేవారు. ప్రస్తుతం ఆ రాయల్ ఎన్ ఫీల్డ్ ఆహ్వానం హోటల్ లోనే ఉంది.

* హరికృష్ణకు సొంతంగా రామకృష్ణ థియేటర్ అబిడ్స్ లో ఉంది. అందులోనే సినిమాలు చూడడం ఆయనకు అలవాటు.. ఇప్పుడు ఎన్ని మల్టీఫ్లెక్స్ లు, థియేటర్లు వచ్చినా ఇప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలను ఆయన రామకృష్ణ థియేటర్ లోనే చూసేవారట.. నాడు ఎన్టీఆర్ నటించిన సినిమాల నుంచి రామకృష్ణ థియేటర్ లోనే సినిమాలు చూడడం హరికృష్ణ కు అలవాటుగా మారింది.
Tags:    

Similar News