నజ్రియా ఈ సినిమాను ఒప్పుకోవడమే గొప్ప విషయం: నాని

Update: 2022-06-04 11:30 GMT
నాని హీరోగా 'అంటే ..సుందరానికీ' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో, కథానాయికగా నజ్రియా పరిచయమవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో నాని - నజ్రియా పాల్గొన్నారు. నాని మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను పంచెకట్టుతో కనిపిస్తాను .. చూడ్డానికి చాలా బాగుంటుందిగానీ .. కట్టుకోవడం చాలా కష్టం.

 ఇక ఒక కథ చెప్పి నజ్రియాను ఒప్పించడం చాలా కష్టం. అయినా వివేక్ ఆత్రేయ తమిళంలో ఆమెకి కథను చెప్పి ఒప్పించాడు. నజ్రియా తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.

కానీ ఆమె అసలు అందుబాటులో ఉండటమే కష్టం. మలయాళంలోనే ఆమె చాలా కూల్ గా నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తారు. ఈ సినిమా కథ వినగానే నాకు హీరోయిన్ నజ్రియా అయితే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు కొన్ని నేను చూశాను .. ఆమె యాక్టింగ్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు.

ఇంతకుముందు రెండు మూడు సినిమాలకి కూడా నజ్రియా అయితే బాగుంటుందని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఎందుకం టే తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే ఆర్టిస్టులు అంటే నాకు ఇష్టం.

అందువలన అలాంటి పాత్రలతో కూడిన కథలను విన్నప్పుడు ఆమెను గురించి చర్చించుకోవడం జరిగింది. తెలుగు సినిమాలు చేసే ఆలోచన లేదేమోనని వదిలేయడం జరిగింది. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, చర్చలతో ఆపకుండా కొంచెం గట్టిగా ట్రై చేయడం జరిగింది. ఇలా ఒక కథ ఉందని చెప్పేసి నేను మెసేజ్ చేయడంతో ఆమె వినేసి ఓకే చేయడం జరిగింది.

నా విషయానికి వస్తే .. నేను హీరోను అనే విషయాన్ని పక్కన పెట్టేసి సాధారణమైన ప్రేక్షకుడిగానే కథ వింటాను. అలా వివేక్ ఈ కథ చెబుతూ ఉండగానే చాలా ఎంజాయ్ చేశాను. అప్పటికి ఆయన సెకండాఫ్ రెడీ చేసుకోలేదు .. అయినా ఆయనతో కలిసి పని చేయనున్నట్టు చెప్పేశాను. అందుకు కారణం ఆయన కథను చెప్పే తీరు .. పాత్రలను మలిచే విధానం. నేను ఎప్పుడూ కూడా లంచ్ తరువాత కథలు వినే కార్యక్రమాన్ని పెట్టుకుంటాను. లంచ్ చేసిన తరువాత నిద్ర వస్తుంటుంది. నిద్ర రాకుండా చేసిందంటే అది మంచి కథ అని అర్థం" అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News