వెనక్కి తగ్గని నాని.. వినాయక చవితికే 'టక్ జగదీష్'

Update: 2021-08-27 08:35 GMT
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''టక్‌ జగదీష్''. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనే విషయం మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నిర్మాతల శ్రేయస్సు కోరి సినిమా రిలీజ్ నిర్ణయం వాళ్ళకే వదిలేశానని నాని ప్రకటిస్తే.. పరిస్థితులు బాగాలేకపోవడంతో డిజిటల్ రిలీజ్ కోసం నాని ని ఒప్పించామని మేకర్స్ తెలిపారు. ఏదైతేనేం 'వి' తర్వాత నాని మరో సినిమాని థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడు స్ట్రీమింగ్ కి పెడతారనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

వినాయక చవితి సంధర్భంగా 'టక్‌ జగదీష్' చిత్రాన్ని సెప్టెంబర్ 10న ఓటీటీలో విడుదల చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అదే రోజున ఆల్రెడీ 'లవ్ స్టోరీ' సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తుండటంతో నాని మూవీపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పండగ సమయాల్లో థియేటర్ చిత్రాలకు పోటీగా ఓటీటీ రిలీజులు కరెక్ట్ కాదని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దీన్ని ఖండించింది.. నాని సినిమాని వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. అందుకే 'టక్‌ జగదీష్' రిలీజ్ డేట్ పై అందరిలో ఆసక్తి ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో తాజాగా 'టక్‌ జగదీష్' చిత్రాన్ని వచ్చే నెల 10వ తారీఖున అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నాని ప్రకటించారు. పండక్కి ఫ్యామిలీతో కలిసి చూడమని ట్వీట్ చేసాడు. 'భూదేవిపురం నాయుడు గాని అబ్బాయి టక్ జగదీష్ చెప్తున్నాడు.. మొదలెట్టండి' అంటూ ఓ అనౌన్సమెంట్ వీడియోని కూడా వదిలారు. నాని వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు సెప్టెంబర్ 10న థియేటర్ vs ఓటీటీ మధ్య పోటీ అనివార్యం అయింది. మరి 'లవ్ స్టోరీ' చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచన చేస్తారేమో చూడాలి.

కాగా, 'టక్‌ జగదీష్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది నిర్మించారు. ‘నిన్నుకోరి’ తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో రీతూవర్మ - ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు - నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.


Full View




Tags:    

Similar News