బిగ్ బాస్ లో అడ్డంగా బుక్కైన బాబు గోగినేని

Update: 2018-07-08 08:30 GMT
బిగ్ బాస్ మస్త్ మజాగా సాగుతోంది. శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాని రెట్టించిన ఉత్సాహంతో అలరించాడు.  వస్తూనే పిట్టకథతో ప్రోగ్రాంను మొదలు పెట్టిన నాని.. ఇంటిసభ్యులను ఓ ఆట ఆడుకున్నారు. సగటు ప్రేక్షకుడి అభిప్రాయాన్ని హోస్ట్ గా వారికి తెలియజేశాడు. కాసేపు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. కాసేపు వారితో సరదాగా మాట్లాడుతూ అలరించాడు. ఇంటికెప్టెన్ అయిన కౌశల్ ను అభినందిస్తూనే ఇంట్లో ఈ వారం జరిగిన గొడవలపై ఆరాతీశారు.

ముఖ్యంగా ఇంట్లో అన్ని తెలుసు అని ఫీలయ్యే హేతువాది బాబు గోగినేనిని ఈ శనివారం నాని అడ్డంగా బుక్ చేశాడు. ఇంటా బయటా అందరికీ నీతులు చెప్పే బాబు గోగినేని సైతం తేజస్వి మాయలో పడిపోయి దీప్తి నల్లమోతును తిట్టడంపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక తేజస్వి మాటలు విని బాబు గోగినేని... దీప్తిని తిట్టడంపై నాని ఫైర్ అయ్యారు. ‘‘తేజస్వి మాటలు విని మీరు దీప్తి ని నామినేట్ చేశారు. దేవుడు కనిపించడు కాబట్టి నమ్మరు.. కానీ మీరు ఫ్రూఫ్ లేకుండా ఆమెను ఎలా తిట్టారు.. నామినేట్ చేశారు’ అని నాని ప్రశ్నించాడు. దీనికి బాబు గోగినేని స్పందిస్తూ.. ‘జరిగిన సంఘటనలు.. తేజస్వి మాటలతోనే దీప్తిని నామినేట్ చేశా’ అని గోగినేని చెప్పారు. దీనికి నాని ఫైర్ అయ్యారు.. ‘ఈవారం దీప్తి ఎలిమినేట్ అయితే .. దానికి మీరే కారణం అవుతారు’ అని నాని మండిపడ్డారు.. దీంతో సరైన సమాధానం చెప్పలేక.. టాపిక్ డైవర్ట్ చేస్తూ బాబు గోగినేని తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
 
ఈ సందర్భంగా తేజస్విపై కూడా  నాని  మండిపడ్డాడు. ‘మీరు హౌస్ లోపల ఎలా ఉంటున్నారన్నది బయట ప్రేక్షకులు చూస్తున్నారు. క్యారెక్టర్లు అనేవి హౌస్ లో ఉన్న వారు డిసైడ్ చేస్తే జరగదు.. మిమ్మల్ని చూసే ప్రేక్షకులు డిసైడ్ చేస్తే జరుగుతుంది.  నీ వీక్ నెస్ వల్ల మిగతా ఇంటిసభ్యులు అంతా ఇబ్బంది పడుతున్నారు. తర్వాతి వారం మళ్లీ ఇలా కనిపించకూడదు ’ అంటూ తేజస్వికి నాని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

ఇంటి కెప్టెన్ అయిన కౌశల్.. తన ఇంటి సభ్యులందరూ సహకరిస్తున్నారని.. ధన్యవాదాలంటూ నానికి చెప్పాడు.. కానీ ఇంటిసభ్యులు కౌశల్ ను ఎంతలా తిడుతున్నారో.. సెటైర్లు వేస్తున్నారో ఓ వీడియోను చూపించాడు. దీంతో హర్ట్ అయిన కౌశల్.. తన వెనుకాల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని వాపోయాడు. ముఖ్యంగా బాబు గోగినేని.. కౌశల్ కు సన్నిహితంగా ఉంటూనే.. అతనిపై జోక్స్ వేయడం.. వ్యతిరేకంగా మాట్లాడడం కనిపించింది.

ఇక ఇంటిసభ్యులు సామాన్యుడు గణేష్ ను నామినేట్ చేస్తుండడం.. దానికి వాళ్లు చెబుతున్న కారణంపై నాని మండిపడ్డాడు. ‘‘అతను ఇంట్లో ఉండడం ఇష్టం లేదని నామినేట్ చేయండి.. అంతేకానీ గణేష్ అమాయకుడు అందుకే చేస్తామని మంచోళ్లలా కలరింగ్ ఇవ్వొద్దు’’ అంటూ ఇంటిసభ్యులను నాని హెచ్చరించాడు. గణేష్ తో ఎవరూ బాధను పంచుకోవడం లేదని.. ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదన్నాడు. ఏదైనా బాధ ఉంటే తనతో చెప్పుకోవాలని గణేష్ కు నాని సూచించాడు.

ఇక చివర్లో నామినేషన్ ప్రక్రియను నాని ప్రస్తావించారు. ఈ వారం ఎనిమిది మందిలో గణేష్ - గీతామాధురి సేఫ్ అని ప్రకటించాడు. మిగతా ఆరుగురి కౌశల్ - శ్యామల - బాబు గోగినేని - నందిని - దీప్తీలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం చెబుతానని నాని ట్విస్ట్ ఇచ్చాడు.
Tags:    

Similar News