శ్యామ్‌ సింగ రాయ్‌ హిందీలో రిలీజ్ చేయాలని ఉంది కాని..!

Update: 2021-11-09 05:32 GMT
నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా సాయి పల్లవి.. కృతి శెట్టి.. మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా రూపొందిన భారీ బడ్జెట్‌ మూవీ శ్యామ్‌ సింగ రాయ్. పూర్వ జన్మల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం అందుతోంది. ట్యాక్సీవాలా సినిమాను ఆత్మల నేపథ్యంలో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నానితో ఈ సినిమాను చేశాడు. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా ను చెబుతున్నారు. కోల్‌ కత్తా బ్యాక్‌ డ్రాప్ లో నాని ఒక పాత్ర కనిపించబోతుంది. ఆ పాత్ర చాలా అద్బుతంగా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. జర్నలిస్ట్‌ గా ఆ పాత్రలో వింటేజ్ లుక్ లో నాని కనిపిస్తాడని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్‌ లను బట్టి అర్థం అవుతోంది.

ఆ పాత్రకు జోడీగా సాయి పల్లవి కనిపించబోతుంది. మరో పాత్ర కు సంబంధించిన లుక్ ను ఇప్పటి వరకు రివీల్‌ చేయలేదు. ఆ పాత్రకు కృతి శెట్టి మరియు మడోనా లు జతగా నటించబోతున్నట్లుగా చెబుతున్నారు. సినిమా లో నానిని దర్శకుడు చూపించే విధానంకు ప్రేక్షకులు సర్‌ ప్రైజ్ అవుతారని అంటున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా అప్పీల్‌ ఉన్న స్క్రిప్ట్‌ అవ్వడంతో పాటు నానికి అక్కడ మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి విజయాన్ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నానికి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా మరింతగా గుర్తింపు తేవడం ఖాయం అనుకుంటున్న సమయంలో హిందీలో ఈ సినిమాను విడుదల చేసే విషయమై వెనక్కు తగ్గినట్లుగా వార్తలు వస్తున్నాయి.

నాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్యామ్‌ సింగ రాయ్ సినిమా ను హిందీలో విడుదల చేయాలని ఉంది.. కాని అక్కడ రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయన్నాడు. హృతిక్‌ రోషన్ ఈ సినిమా కథపై ఇంట్రెస్ట్‌ చూపించి అక్కడ రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని.. అందుకే సినిమా హిందీ వర్షన్ ను విడుదల చేయకుండా హోల్డ్‌ లో ఉంచుతున్నట్లుగా సమాచారం అందుతోంది. హిందీలో కూడా సినిమాను విడుదల చేస్తే మంచి వసూళ్లు నమోదు అవుతాయి అనుకుంటున్న సమయంలో హిందీ డబ్బింగ్‌ తో అక్కడ విడుదల అవ్వడం లేదని తేలిపోయింది. అయితే సబ్ టైటిల్స్ తో సినిమాను ఉత్తరాదిన పలు చోట్ల తెలుగు భాషతోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా మాత్రం సమాచారం అందుతోంది. ఇప్పటికే నాని నటించిన జెర్సీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని హిందీలో రీమేక్‌ అయ్యింది. నాని మంచి కథలు ఎంపిక చేసుకుంటాడనే నమ్మకంతో ఈ సినిమా ను కూడా అక్కడ రీమేక్ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది.




Tags:    

Similar News