మూవీ రివ్యూ: నన్ను వదిలి నీవు పోలేవులే

Update: 2016-04-02 06:09 GMT
చిత్రం : నన్ను వదిలి నీవు పోలేవులే

నటీనటులు: కోలా బాలకృష్ణ-వామికా గబ్బి-పార్వతి నాయర్-కళ్యాణి నటరాజన్ తదితరులు
సంగీతం: అమృత్
ఛాయాగ్రహణం: శ్రీధర్
మాటలు: కృష్ణతేజ
నిర్మాత: కోలా భాస్కర్
రచన: శ్రీరాఘవ
దర్శకత్వం: గీతాంజలి

అవ్వడానికి తమిళ దర్శకుడే కానీ.. శ్రీరాఘవ అంటే మన ప్రేక్షకులకు కూడా మంచి గురే ఉంది. 7/జి బృందావన కాలనీ సినిమాతో అతను మన ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతోనూ బాగానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు శ్రీరాఘవ కథ-స్క్రీన్ ప్లే అందించి.. అతడి భార్య గీతాంజలి డైరెక్ట్ చేసిన ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ మన ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీరాఘవ ముద్రతో ప్రేక్షకుల్ని ఆకర్షించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చిన్నప్పట్నుంచి ఆడవాసనే ఎర‌గ‌కుండా పెరిగిన‌ ప్రభు (కోలా బాలకృష్ణ).. అందమైన ఓ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ గా చేసుకోవాలని ఆశపడుతుంటాడు. మరోవైపు ఓ అబ్బాయితో బ్రేకప్ అయిన మనోజ (వామికా గబ్బి) పెళ్లి అంటేనే ఏహ్య భావంతో ఉంటుంది. ఐతే క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లి కోరిక మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభును పెళ్లి చేసుకుంటుంది మనోజ. కానీ అతడితో కాపురం మాత్రం చేయదు. ప్రభు ముందు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి తర్వాత ఆమెకు నెమ్మదిగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. మనోజ మనసు మారుతున్న సమయంలో ఓ రాత్రి తాగిన మైకంలో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రేప్ చేస్తాడు ప్రభు. అప్పుడు మనోజ ఏం చేసింది.. వీళ్ల బంధం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సౌత్ ఇండియాలో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసిన దర్శకుల్లో శ్రీరాఘవ ఒకడు. అతడి సినిమాలు అదో రకం. సినిమాలు హిట్టయినా.. ఫ్లాపైనా అతడి సినిమాలు వేసే ఇంపాక్ట్ అన్నది మామూలుగా ఉండదు. కొన్ని రోజులు.. నెలలు.. సంవత్సరాల పాటు కూడా అతడి సినిమాల ప్రభావం ఉంటుంది. కాదల్ కొండేన్ (తెలుగులో నేను).. 7/జి బృందావన కాలనీ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. శ్రీరాఘవ కథతో అతడి భార్య తెరకెక్కించిన ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ సైతం శ్రీరాఘవ ముద్ర స్పష్టంగా కనిపించే సినిమా. 7/జి తరహాలోనే అలాంటి పాత్రలతోనే సాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులపై కొంత వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. ‘7/జి’ ఏమాత్రం పొంతన లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టే నేపథ్యంలో సాగితే.. ‘నన్ను వదిలి..’ మూవీ విరుద్ధ స్వభావాలున్న ఇద్దరు వ్యక్తులకు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి అయ్యాక వాళ్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూపెడుతుంది. ఇందులోని లీడ్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులు బాగానే కనెక్టవుతారు.

సామాన్య జనానికి పట్టని అవార్డు సినిమాలకు మాత్రం సూటవుతుంది అనిపించే కథాంశంతో ఈ సినిమాను తీయడం ఒక రకంగా పెద్ద సాహసమే. ఇది హార్డ్ హిట్టింగ్.. బోల్డ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని చాలా వరకు ప్రభావవంతంగా చెప్పే ప్రయత్నం చేశారు. శ్రీరాఘవ స్టోరీ.. స్క్రీన్ ప్లే రెంటికీ మంచి మార్కులు పడతాయి. ఈ విషయంలో సందేహం లేదు. టిపికల్ శ్రీరాఘవ స్టయిల్లో సాగే కథనం చాలా వరకు ప్రేక్షకుల్నిఎంగేజ్ చేస్తుంది. హీరో హీరోయిన్ల పాత్రలే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రల్ని బాగా తీర్చిదిద్దాడు శ్రీరాఘవ. విరుద్ధ స్వభావాలున్న ఆ పాత్రలు పెళ్లి చేసుకుని ఒకచోటికి రావడంతో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తి రేపుతాయి. మొదట్లో ఘర్షణ.. ఆ తర్వాత బాండింగ్.. నేపథ్యంలో కథనం బాగానే సాగిపోతుంది. హార్డ్ హిట్టింగ్ గా అనిపించే ఇంటర్వెల్ ముందు సన్నివేశాన్ని చాలా సహజంగా తెరకెక్కించింది గీతాంజలి. ఐతే ద్వితీయార్ధానికి వచ్చేసరికి ఆమె పట్టు కోల్పోయింది. ప్రథమార్ధం వరకు కనిపించే శ్రీరాఘవ ముద్ర రెండో అర్ధంలో మిస్సయింది. హీరో హీరోయిన్లు విడిపోవడం.. మళ్లీ కలవడం అన్నది చాలా సినిమాల్లో చూశాం. ఐతే ఈ కలిసే ముందు నడిచే వ్యవహారం శ్రీరాఘవ స్టయిల్లో వెరైటీగా ఉంటుందని ఆశిస్తాం కానీ.. అంత ప్రత్యేకంగా ఏమీ ఉండదా ఎపిసోడ్. అన్ని సినిమాల్లో లాగే రొటీన్ గా బండి లాగించేశారు.

‘నన్ను వదిలి..’ చూస్తుంటే కొన్నిసార్లు ఒక గొప్ప సబ్జెక్టుని ఉన్నత ప్రమాణాలతో డీల్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.. అదే సమయంలో కొన్ని చోట్ల చీప్ అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. తన భార్య ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన‌పుడు హీరోలో చెలరేగే అనుమానపు జ్వాలకు సంబంధించిన సన్నివేశం ఇందుకు సరైన ఉదాహరణ. తన భార్య వేరొకరితో శృంగారంలో పాల్గొంటోందేమో అని భర్తలో అనుమానం ఉన్నపుడు.. ఆ ఫీలింగుని కేవలం అతడి హావభావాల ద్వారా కూడా చూపించొచ్చు. కానీ అతడి ఊహల్లో ఉన్న అతడి భార్య సెక్స్ ఎక్స్ ప్రెషన్లను సైతం రీలు వేసి మనకు చూపించాల్సిన పని లేదు. ఈ సన్నివేశం.. అప్పటిదాకా ఓ మెచ్యూర్డ్ మూవీ చూస్తున్నట్లుగా ఉన్న ఫీలింగ్ మొత్తం పోగొట్టేస్తుంది. ఓ మహిళా దర్శకురాలి సినిమాలో ఇదేంటన్న అభిప్రాయం కూడా కలుగుతుంది.

ఇక చాలా వరకు రియలిస్టిగ్గా సాగే ఈ సినిమాలో అక్కడక్కడా డ్రమటిగ్గా అనిపించే అనిపించే సన్నివేశాలు.. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమా స్థాయిని బాగా తగ్గించేస్తాయి. భార్యాభర్తలైన హీరో హీరోయిన్లిద్దరూ డిన్నర్ కు వెళ్లినపుడు.. ఒకేసారి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు మాజీ బాయ్ ఫ్రెండ్స్ వచ్చి భార్యను పలకరించడం అన్నది అతి కాక మరేంటి? ద్వితీయార్ధంలో కూడా ఇలాంటి అసహజ సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. క్లైమాక్స్ లో అయితే మెలోడ్రామా మరీ ఎక్కువైపోయింది. హీరో హీరోయిన్లిద్దరూ ఏ ఇబ్బందీ లేకుండా కలిసిపోవడానికి అక్కడ ఏ ఇబ్బందీ లేకున్నా.. ఏదో బలమైన ఇంపాక్ట్ ఉండాల్సిందే అన్నట్లు హీరో కత్తితో పొడుచుకునే సన్నివేశం పెట్టడం టూమచ్ డ్రమటిగ్గా అనిపిస్తుంది. ‘7/జి బృందావన కాలనీ’ తరహాలో ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా టచ్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టిన ఈ సన్నివేశం తేలిపోయింది. శ్రీరాఘవ అయితే ఇదే కంటెంట్ తో క్లైమాక్స్ ను మరింత ఎఫెక్టివ్ గా తీయగలిగాడేమో కానీ.. అతడి భార్య మాత్రం క్లైమాక్స్ ను సరిగా డీల్ చేయలేకపోయింది. ఐతే లైటర్ నోట్ లో ముగించిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా చూస్తే ఓ మంచి కాన్సెప్ట్ ను గీతాంజలి అనుకున్నంత ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయలేకపోయిందన్న ఫీలింగ్ కలిగిస్తుంది.

నటీనటులు:

కోలా బాలకృష్ణను చూస్తే ‘7/జి’లో రవికృష్ణను చూస్తున్నట్లే అనిపిస్తుంది. పాత్రతో పాటు నటన విషయంలోనూ పోలికలు కనిపిస్తాయి. 7/జికి కొనసాగింపులా ఉన్న పాత్ర కాబట్టి.. రవికృష్ణను బాలకృష్ణ అనుకరిస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ.. అతను బాగా నటించాడనడంలో సందేహం లేదు. పాత్రకు సరిపోవడంలోనే అతను సగం విజయం సాధించాడు. నటన పరంగా ఎక్కడా ఇబ్బంది పడలేదు. కోర్టు సీన్లో అతడి నటన సూపర్బ్ అనిపిస్తుంది. వామికా గబ్బి అద్భుతంగా నటించింది. ‘భలే మంచి రోజు’లో మామూలు పాత్రలోనే చక్కగా నటించిన వామిక.. మనోజ పాత్రలో ఒదిగిపోయింది. హీరోయిన్లకు ఇంత ఇంటెన్సిటీ ఉన్న.. బలమైన పాత్రలు దొరకడం అరుదు. ఐతే ఇలాంటి క్యారెక్టర్ చేయడం అందరి వల్లా కూడా కాదు. ఐతే వామిక చక్కటి నటనతో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. మిగతా నటీనటులందరూ కూడా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాకు టెక్నీషియన్లు దాదాపుగా కొత్త వాళ్లే పని చేశారు. ఐతే ఔట్ పుట్ బాగుంది. శ్రీరాఘవ సినిమాలకు తగ్గ స్టయిల్లో మ్యూజిక్ డైరెక్టర్ అమృత్.. ఛాయాగ్రాహకుడు శ్రీధర్ తమ పనితనం చూపించారు. అమృత్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. శ్రీధర్ టిపికల్ శ్రీరాఘవ సినిమాల తరహా ఛాయాగ్రహణం అందించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కృష్ణతేజ మాటలు ఓకే. దర్శకత్వ పరంగా గీతాంజలి ముద్రంటూ ఏమీ లేదు. చాలా వరకు సినిమాలో శ్రీరాఘవ ముద్ర కనిపిస్తుంది. సినిమాలో మెలోడ్రామా ఎక్కువైన చోటే ఇది శ్రీరాఘవ సినిమా కాదు అన్న ఫీలింగ్ కలుగుతుంది.

చివరగా: బోల్డ్.. బట్ నాట్ దట్ మచ్ బ్యూటిఫుల్

రేటింగ్- 2.25/5
Tags:    

Similar News