నారా బాబు రంగంలోకి దిగాడు!

Update: 2015-06-09 04:50 GMT
సినిమాకి హిట్టు టాక్‌ వచ్చినంత మాత్రాన పని పూర్తయినట్టు కాదు. ఆ టాక్‌ని సద్వినియోగం చేసుకోవడం కూడా చిత్రబృందానికి తెలిసుండాలి. అప్పుడే మరింత మంచి ఫలితాలొస్తాయి. ఇటీవల కాలంలో బాగున్నాయి అని పేరు తెచ్చుకొన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఆ టాక్‌ స్థాయిలో వసూళ్లు మాత్రం తెచ్చుకోలేకపోయాయి. అదంతా ప్రమోషన్‌లో లోపమే. ఈరోజుల్లో సినిమా ఎలా తీశామన్నది ముఖ్యం కానే కాదు, తీసిన సినిమాని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లామన్నదే కీలకం. ఆ విషయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ బాగానే గమనిస్తున్నట్టుంది. అందుకే బాలీవుడ్‌ తరహాలో రకరకాల ప్రమోషన్‌ పద్ధతుల్ని అవలంభిస్తోంది.

 'కేరింత' టీమ్‌ సినిమా విడుదలకు ముందు ఊరూరా, షాపింగ్‌ మాల్స్‌ చుట్టూ తిరుగుతూ తమ సినిమాని ప్రమోట్‌ చేసుకొంటోంది. నారా రోహిత్‌ కూడా తన  'అసుర' ప్రేక్షకుల ముందుకొచ్చాక, బాగుంది అనే టాక్‌ వచ్చాక ప్రమోషన్‌ మొదలుపెట్టాడు. ఆ టాక్‌ని సద్వినియోగం చేసుకొంటూ సినిమాకి వసూళ్లు పెంచాలన్నదే ఆయన లక్ష్యం. ఆ మేరకు ఉత్తరాంధ్ర టూర్‌ వేశాడు. అలా ప్రతీ ఏరియాలోనూ థియేటర్లు తిరిగి సినిమాకి మరింత హైప్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాకి స్వతహాగా నారా రోహిత్‌ కూడా ఓ నిర్మాతే కాబట్టి ప్రమోషన్‌ వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకొంటున్నారు. డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అనే టాక్‌ 'అసుర' సంపాదించింది. నారా రోహిత్‌ అండ్‌ టీమ్‌ మరింత పకడ్బందీగా ప్రమోషన్‌ చేసుకొంటే మాత్రం సినిమాకి భారీ లాభాలొచ్చే అవకాశాలున్నట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News