ఒంటి చేతి నారా రోహిత్

Update: 2018-07-20 05:59 GMT
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలుస్తున్నాడు నారా రోహిత్. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే అన్నీ కూడా వైవిధ్యమైనవే. అతడి పాత్రల్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. తాజాగా అతను మరో పెద్ద సాహసం చేసినట్లు సమాచారం. ‘వీర భోగ వసంతరాయలు’ సినిమాలో రోహిత్ ఒంటి చేత్తో కనిపించబోతున్నాడట. ఇంద్రసేన అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో రోహిత్ తో పాటు శ్రీవిష్ణు.. సుధీర్ బాబు.. శ్రియ సరసన కీలక పాత్రలు పోషించారు. వీళ్ల పాత్రలన్నీ కొత్తగా ఉంటాయట. తెలుగులో ఇప్పటిదాకా రాని వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందిందట. ఇందులో రోహిత్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని.. అతడికి ఇందులో కుడిచేయి ఉండదని అంటున్నారు.

రోహిత్ మామూలుగా ఎడమచేతి వాటం. అందుకే ఎడమ చేతిని ఉంచి కుడి చేయి లేనట్లు చూపించారు. మామూలుగానే ఎడమ చేతి వాటం కాబట్టి.. దాంతో అన్ని పనులు  చేసుకునేట్లు చూపిస్తారట. మరి ఈ పాత్రలో రోహిత్ తన ప్రత్యేకతను ఎలా చూపిస్తాడో చూడాలి. ఈ చిత్రం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. దీనికంటే ముందు జగపతిబాబుతో కలిసి రోహిత్ నటించిన ‘ఆటగాళ్ళు’ ఆగస్టులో విడుదల కానుంది. గతంతో పోలిస్తే రోహిత్ ఈ మధ్య సినిమాలు చేసే విషయంలో స్పీడు తగ్గించాడు. అతడి చేతిలో మూణ్నాలుగు సినిమాలున్నాయి. ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరితో రోహిత్ తన తర్వాతి సినిమా చేసే అవకాశముంది. ‘సావిత్రి’ దర్శకుడు పవన్ సాధినేనితో కూడా రోహిత్ ఓ సినిమా చేయాల్సి ఉంది.
Tags:    

Similar News