తొలి సినిమా సంగతేంటి హీరో..

Update: 2016-03-21 01:30 GMT
రోజుకో కొత్త హీరో వచ్చేస్తున్నాడు టాలీవుడ్ లోకి. అందులో ఎక్కువగా సినీ ఫ్యామిలీస్ కు చెందిన హీరోలే ఉంటుండటం విశేషం. టాలీవుడ్ లో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న హీరోల్లో 70-80 శాతం మంది దాకా వారుసులే అంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ కోవలోనే హీరో కావాలని ఆశపడ్డాడు నవీన్ విజయకృష్ణ. సీనియర్ నటుడు నరేష్ కొడుకితను. విజయనిర్మలకు మనవడు. దాదాపు రెండేళ్ల కిందటే నవీన్ హీరోగా మహేష్ బాబు చేతుల మీదుగా ఓ సినిమా మొదలైంది. పేరు.. ‘ఐనా ఇష్టం నువ్వు’. ఈ మధ్యే ‘నేను శైలజ’తో మంచి విజయాన్నందుకున్న కీర్తి సురేష్ కథానాయిక. ఆ మధ్య ఎప్పుడో టైటిల్ ప్రకటించారు. ఆ తర్వాత ఆ సినిమా ఊసే లేదు.

తొలి సినిమా సంగతేంటో తేల్చలేదు కానీ.. ఈ మధ్యే నవీన్ హీరోగా రెండో సినిమా మొదలుపెట్టేశారు. పీవీ గిరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో నవీన్ సరసన నిత్యా నరేష్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్.వి.సి ఎంటర్‌ టైన్‌ మెంట్స్ పతాకంపై బిక్షమయ్య - రాధాకిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ - విజయనిర్మల - నరేష్ - సాయిధరమ్ తేజ్ తదితరులు ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ నవీన్ హీరోగా చేస్తున్న రెండో చిత్రమిది.  వైవిధ్యమైన ప్రేమకథగా అందరినీ నవ్వించే ఎంటర్‌టైనర్’’ అన్నారు. ఐతే ఈ సినిమా పూర్తయ్యే లోపైనా నవీన్ తొలి సినిమా రిలీజవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News