ఈ ఏడాది నేష‌న‌ల్ అవార్డ్‌ మ‌న‌దేనా?

Update: 2022-03-29 00:30 GMT
ఈ ఏడాది నేష‌న‌ల్ అవార్డ్ మ‌న‌కు ప‌క్కానా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు, విమ‌ర్శ‌కులు నిజ‌మ‌నే చెబుతున్నారు. కార‌ణం ఈ శుక్ర‌వారం విడుద‌లైన ట్రిపుల్ ఆర్‌. దాదాపు మూడున్న‌రేళ్లుగా ఇద్ద‌రు హీరోల అభిమానుల‌తో పాటు కోట్లాది మంది సినీ ప్రియులు ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూశారు. మొత్తానికి అడ్డంకుల‌న్నీ తొల‌గి ట్రిపుల్ ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ప్రీమియ‌ర్ షోల‌తో ముందు త‌న రికార్డుల ఖాతాని ప్రారంభించింది.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల సునామీ సృష్టిస్తూ ఊహించ‌ని స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ గా విడుద‌లైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగిస్తోంది. 1920 బిఫోర్ ఇండిపెండెన్స్ ఎరా నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతా రామ‌రాజుగా, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌ల్లో న‌టించారు.

అయితే ఈ పాత్ర‌ల్లో ఈ ఇద్ద‌రు స్టార్ల అభిన‌యం న‌భూతో న‌భ‌విష్య‌తి అంత అద్భుతంగా న‌టించారు. ఎన్టీఆర్‌ని గొలుసుల‌తో బంధించిన మొల‌ల కొర‌డాతో కొడుతున్న సంద‌ర్భంలో ఇద్ద‌రి న‌ట‌న ప‌తాక స్థాయిలో వుండి అందిరి చేత శ‌భాష్ అనిపించింది. అంతే కాకుండా ఈ సంద‌ర్భంగా త‌న‌ని లొంగిపొమ్మ‌ని చెబుతున్న చ‌ర‌ణ్ ని చూస్తూ లొంగిపోవ‌డం అంటే ఏంటో చెబుతూ ఎన్టీఆర్ `కొమురం భీముడో కొమురం భీముడో..` అంటూ పాడే పాట‌లో ప‌లికించిన హావ భావాలు, పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో వున్నాయి.

ఎన్టీఆర్ ని బాధ‌పెడుతున్నా ఆ బాధ‌ని పంటి బిగువుని భ‌రిస్తూ కళ్ల‌ల్లో భావాల్ని ప‌లికిస్తూ చ‌ర‌ణ్ న‌టించిన తీరు కూడా అద్భుతంగా వుంది. ఈ ఒక్క సీన్ లోనే వీరి న‌ట‌నా చాతుర్యం, వీరి ప్ర‌తిభ ఏంటో స్ప‌ష్ట‌మైంది.  త‌న వాళ్ల‌ని బాధ‌పెడుతున్నాన‌నే భావోద్వేగాన్ని దిగ‌మింగుతూనే చ‌ర‌ణ్ న‌టించిన తీరు.. అమాయ‌కంగా క‌నిపిస్తూనే త‌న వాళ్ల కోసం క్ష‌ణాల్లో బెబ్బులిలా మారే స్వ‌భావం వున్న పాత్ర‌లో ఎన్టీఆర్ ప‌లికించిన అభిన‌యం ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సినిమాలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఒక‌రిని మించి ఒక‌రు పోటీప‌డి మ‌రీ న‌టించారు.

ఇక క్లైమాక్స్ స‌న్నివేశాల్లో చ‌ర‌ణ్ ఎలివేష‌న్ సీక్స్ లో వుంటే అత‌న్ని విడిపించి గాయాల‌తో న‌డ‌వ‌లేక‌పోతుంటే త‌న భుజాల‌పై కెత్తుకుని ఎన్టీఆర్ మోసిన విధానం కూడా ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల్ని సైతం మెప్పిస్తోంది. దీంతో ఈ ఇద్ద‌రు స్టార్ల‌పై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. వెండితెర‌నే అబ్బుర‌ప‌రిచే స్థాయిలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ త‌మ త‌మ పాత్ర‌ల్లో న‌టించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. కెరీర్ బెస్ట్ పెర్ఫ‌ర్మెన్స్ ని అందించిన ఈ ఇద్ద‌రు హీరోల‌ని ఈ ఏడాది జాతీయ పుర‌స్కారం వ‌రించ‌డం ఖాయం అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

అదే జ‌రిగితే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ అభిమానుల‌కు పండ‌గే అంటున్నారు. జాతీయ పుర‌స్కారాల‌కు మ‌రి కొన్ని నెల‌లే స‌మ‌యం వుండ‌టంతో ఈ ద‌ఫా మ‌న టాలీవుడ్ కు ట్రిపుల్ ఆర్ తో జాతీయ పుర‌స్కారం ప‌క్కా అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ మాటలు నిజం కావాలంటే మ‌రి కొన్ని నెల‌లు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News