నాని సరైన ప్లానింగ్ తో వెళ్లడం లేదా..?

Update: 2022-07-07 07:30 GMT
సూపర్ సీనియర్ హీరోలు - స్టార్ హీరోలను పక్కన పెడితే.. టాలీవుడ్ లో ఐదారుగురు టైర్-2 హీరోలు ఉన్నారు. రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ, ఏడాది పొడవునా ప్రేక్షకులను అలరించేది వీరి చిత్రాలే. ఈ జాబితాలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉంటాడని చెప్పాలి.

కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాని.. తనకంటూ ప్రత్యేకంగా మార్కెట్‌ ను క్రియేట్ చేసుకున్నాడు. త్వరలోనే టైర్-1 హీరోల లీగ్ లో చేరుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల కాలంలో అతని సినిమాలు - మార్కెట్ ను పరిశీలిస్తే టైర్-2 హీరోగానే ఉండిపోతాడేమో అనే కామెంట్స్ వస్తున్నాయి.

'వి' 'టక్ జగదీశ్' వంటి రెండు సినిమాలను బ్యాక్ టూ బ్యాక్ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన నాని.. 'శ్యామ్ సింగరాయ్' మరియు 'అంటే సుందరానికి' చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ చేశారు. అయితే థియేట్రికల్ విడుదలైన రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. హిట్ టాక్ తెచ్చుకొని కూడా వసూళ్ళు రాబట్టలేకపోయాయి.

కనీస ఓపెనింగ్స్ కూడా అందుకోకపోవడంతో ఇది నాని మార్కెట్ పై ప్రభావం చూపిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయాయంటేనే ప్రెజెంట్ నాని మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నాని సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్లకపోవడమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాని వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ.. స్టార్ డైరెక్టర్లతో ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడం లేదు. అంతగా క్రేజ్ లేని దర్శకులతో కొత్తవారితో ఎక్కువగా పని చేస్తున్నాడు.

పర్యవసానంగా నాని మినిమమ్ ఓపెనింగ్స్‌ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న 'దసరా' మూవీ కూడా డెబ్యూ డైరెక్టర్ తో చేస్తున్నదే. పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ చేయాలంటే నాని క్రేజ్ ఒక్కటే సరిపోదు.. సరైన దర్శకుడు అవసరం కూడా ఉంది.

అయితే మిగతా టైర్-2 హీరోలందరూ క్రేజీ డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. టాప్ లీగ్ లో చేరడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని పాన్ ఇండియా లక్ష్యంగా ప్లాన్స్ చేసుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' అనే బైలింగ్వల్ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కు రెడీ చేశాడు. ఇదే క్రమంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

'నోటా' 'వరల్డ్ ఫేమస్ లవర్' మరియు 'డియర్ కామ్రేడ్' వంటి ప్లాప్స్ అందుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్ తో 'లైగర్' 'జనగణమన' వంటి బ్యాక్ టూ బ్యాక్ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. సుకుమార్ - కొరటాల శివ వంటి అగ్ర దర్శకులు వీడీ తో సినిమాలు చేయనున్నారు. ఈ సినిమాలు పెద్ద హిట్ అయితే VD మార్కెట్ చాలా రెట్లు పెరుగుతుంది.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నాలుగు వరుస విజయాలతో దూకుడుమీదున్నాడు. 'మజిలీ' వెంకీమామ' 'లవ్ స్టోరీ' 'బంగార్రాజు' చిత్రాలు హిట్ అవ్వడంతో చైతూ మార్కెట్ పెరిగింది. ఇప్పుడు 'మనం' ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో చేసిన 'థాంక్యూ' మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇక 'లాల్ సింగ్ చద్దా' చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీని తర్వాత వెంకట్ ప్రభు - పరశురాం వంటి దర్శకులతో వర్క్ చేయనున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన యూత్ కింగ్ అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఇది అఖిల్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇంకా టీజర్ కూడా రిలీజ్ కాకముందే 70 కోట్ల వరకూ బిజినెస్ పలుకుతోందని ట్రేడ్ టాక్.

ఇలా టాలీవుడ్ టైర్-2 హీరోలంతా క్రేజీ డైరెక్టర్స్ తో ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ సెట్ చేస్తుంటే.. నాని మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్న ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్‌ ను సెట్ చేయడంపై దృష్టి పెట్టడం లేదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మిడ్ రేంజ్ చిత్రాలతో సేఫ్ గేమ్ ఆడితే అతను ఎప్పుడూ మార్కెట్ విస్తరణ లేకుండా టైర్-2 లీగ్‌ లోనే చిక్కుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News