మూవీ రివ్యూ: నేను శైలజ

Update: 2016-01-01 10:48 GMT
చిత్రం : నేను శైలజ

నటీనటులు: రామ్ - కీర్తి సురేష్ - సత్యరాజ్ - రోహిణి - నరేష్ - ప్రగతి - ప్రిన్స్ - శ్రీముఖి - కృష్ణచైతన్య - ప్రదీప్ రావత్ - సుడిగాలి సుధీర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: స్రవంతి రవికిషోర్
రచన - దర్శకత్వం: కిషోర్ తిరుమల

రొటీన్ సినిమాలతో విసుగెత్తిపోయాననే ఓ హీరో తనే స్వయంగా చెప్పే పరిస్థితి వచ్చిందంటే.. అతనెలాంటి సినిమాల్లో నటించాడో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఆ హీరోనే ఈసారి ‘కొత్త’ సినిమా చూపిస్తానని ప్రామిస్ చేశాడు. ఆ హీరో రామ్ అయితే.. ఆ సినిమా ‘నేను శైలజ’. టీజర్, ట్రైలర్ రామ్ ప్రామిస్ ను నిలబెట్టేలాగే కనిపించాయి. మరి సినిమాలో ఏమాత్రం కొత్తదనం ఉంది? వరుస పరాజయాల్లో ఉన్న రామ్ ఈసారైనా సక్సెస్ కొట్టాడా? చూద్దాం పదండి.

కథ:

హరి (రామ్) చిన్నప్పట్నుంచే పెద్ద లవర్ బాయ్. ఎదురింటి అమ్మాయికి తన ప్రేమ చెప్పలేకపోయినందుకు ఫీలై.. తర్వాత కనిపించే ప్రతి అమ్మాయికీ ఐలవ్యూ చెబుతుంటాడు. వాళ్లందరూ ఇతడికి సారీ చెబుతుంటారు. దీంతో ఇక ప్రేమకు, నాకు పడదని ఫిక్సయిపోయిన సమయంలో శైలజ (కీర్తి సురేష్) పరిచయమవుతుంది. తన మీద ఇష్టం చూపిస్తుంది. హరి ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ తన ప్రేమను చెబితే ఆమె అంగీకరించదు. నువ్వంటే ఇష్టమే కానీ.. ప్రేమించలేను అంటుంది. ఇంతకీ శైలజ హరిని తిరిగి ప్రేమించదు. ఆమెను ఒప్పించి.. తనను పెళ్లి చేసుకోవడానికి హరి ఏం చేశాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘నేను శైలజ’ ఎంత బాగుంది అనే దాని కంటే ముందు.. ప్రేక్షకులకు విసుగు పుట్టించిన గత రామ్ సినిమాల్లాగా అయితే లేదు. ఎంత కొత్తగా ఉందన్నది పక్కనబెడితే.. రామ్ ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది చాలా రిఫ్రెషింగ్ గా అనిపించే సినిమా. తన ఫిజిక్, తన ఇమేజ్ కి సూటవ్వని అనవసర బిల్డప్పుల్లేవు.. భారీ ఫైటింగుల్లేవు.. ఫోర్స్డ్ కామెడీ లేదు.. అన్నిటికీ మించి ఇది మమ.. మాస్ సినిమా కాదు. మామూలుగా సాగిపోతూనే మంచి అనుభూతిని కలిగించే ఒక లవ్ స్టోరీ.

కొత్తదనాన్ని అందించడంలో సగమే విజయవంతమైనప్పటకీ.. ఓ దశ దాటాక ఇది కూడా ఓ ‘ఫార్ములా’ ప్రకారం సాగిపోయినప్పటికీ.. రామ్ సినిమాల్లో రొటీన్ గా కనిపించే రొటీన్ గోల మాత్రం ఇందులో లేదు. ముఖ్యంగా లౌడ్ కామెడీ లేకుండా ప్రశాంతంగా సాగిపోవడం.. సిచ్యువేషనల్ కామెడీతో నవ్వులు పండించడం.. ప్రథమార్ధం వరకు రిఫ్రెషింగ్ గా సాగడం.. ఎమోషనల్ సన్నివేశాలు పండటం.. పంచ్ ల కోసం పాకులాడకుండా సన్నివేశాలకు తగ్గట్లు రాసిన డైలాగులు.. సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధానమైన ప్లస్ పాయింట్స్.

ఐతే ద్వితీయార్ధానికి వచ్చేసరికి ఎప్పట్లాగే హీరో ‘దిల్ వాలే’గా మారిపోవడం.. అమ్మాయి కుటుంబాన్ని మెప్పించి తనను తీసుకెళ్లిపోవడం.. ఈ మధ్యలో హీరోయిన్ ఫ్యామిలీని కన్విన్స్ చేసే సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. దర్శకుడి నరేషన్ కూడా స్లో కావడం వల్ల ద్వితీయార్ధం ఇంకా భారంగా అనిపిస్తుంది. ఐతే కొంచెం చమత్కారం జోడించిన క్లైమాక్స్ మళ్లీ ప్రేక్షకుల ముఖాల్లో నవ్వు పులుముకుని థియేటర్ నుంచి బయటికెళ్లేలా చేస్తుంది.

ప్రథమార్ధంలో హీరో చిన్నప్పటి పరిచయం దగ్గర్నుంచి సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు.. వారి మధ్య లవ్ స్టోరీని బిల్డ్ చేసిన తీరు.. మధ్యలో వచ్చే పాటలు అన్నీ చక్కగా కుదిరాయి. ఇట్సే క్రేజీ ఫీలింగ్ సాంగ్.. శైలజా శైలజా సాంగ్.. ఈ రెండూ ఓ కాన్సెప్ట్ ప్రకారం సాగడం.. వాటి చిత్రీకరణ కూడా బాగుండటంతో రెండూ కూడా సినిమాను బాగా డ్రైవ్ చేశాయి. ఇక ప్రథమార్ధంలో వచ్చే సన్నివేశాల్లోని తాజాదనం ఒక కొత్త తరహా సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది.

ఇంటర్వెల్ సీన్ కూడా బాగా పేలింది. ‘‘ఐ లవ్యూ.. బట్ ఐయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యు’’ అనే డైలాగ్ ఇంటర్వెల్ సన్నివేశంలో కొసమెరుపు. ద్వితీయార్ధం మీద ఆసక్తి రేపుతుంది ఇంటర్వెల్ బ్యాంగ్. ఐతే ఆ తర్వాతే కథనం కొంచెం గాడి తప్పి.. ‘రొటీన్’ దారిలోకి వచ్చేస్తుంది. ప్రదీప్ రావత్ పోషించిన కామెడీ క్యారెక్టర్ కొంత వినోదాన్ని పంచినా.. హీరోయిన్ తండ్రికి కూతురి మీద ఉన్న ప్రేమను తెలియజేసే సన్నివేశాల్లో ఎమోషన్ పండినా.. ఏ మలుపులూ లేకుండా మన అంచనాలకు తగ్గట్లు సాగిపోయే రొటీన్ కథనం నిరాశ పరుస్తుంది. ఐతే సినిమాను ముగించడంలో దర్శకుడు తన ప్రతిభ చూపించాడు. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ లో అర్థవంతమైన డైలాగులు ఆకట్టుకుంటాయి. సినిమాను ఓ ఫన్నీ నోట్ తో ముగించడం బాగుంది.

​ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరోయిన్ పెళ్లి సీనుకు ముందు జరిగే సంగీత్ కార్యక్రమంలో భాగంగా హీరో... హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ కి సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శిస్తాడు. అది ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా వుంటుంది. అందులో ప్రతి క్యారెక్టరు మాట్లాడుతుంటే ప్రేక్షకుడు తన ఇంట్లో వారు చెప్తుంటే విన్నట్టే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ తండ్రి సత్యరాజ్ తన కూతురు విషయంలో పడే తపన గురించి చెప్పే ఎమోషన్ సీన్ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సీన్లో సత్యరాజ్ అత్తారింటికి వెళ్లే అమ్మాయిల గురించి చెప్పిన డైలాగ్ చిత్రానికే హైలైట్. "కూతరురిని అత్తారింటికి పంపించాలనే ఆచారం పెట్టినోడు ఎవడో కానీ.. కచ్చితంగా వాడికి కూతరుండి వుండదు‘  అనే అనే డైలాగు ప్రతి అమ్మాయి తండ్రికి కనెక్ట్ అవుతుంది.

నటీనటులు:

సరిగ్గా వాడుకుంటే రామ్ నుంచి ఎలాంటి నటన రాబట్టవచ్చో ‘నేను శైలజ’ చూస్తే తెలుస్తుంది. మాస్ సినిమాల్లో ‘అతి’ వేషాలతోనే విసిగించే రామ్.. ఈ సినిమాలో ఆ అతి అంతా పక్కనబెట్టేసి పాత్రకు తగ్గట్లు ఒద్దికగా నటించాడు. హీరోయిజం చూపించాల్సిన సన్నివేశాల్లో కూడా సింపుల్ గానే చేశాడు. ఇందులో అతని నటన చూస్తే.. ఎప్పుడూ ఎందుకిలా చేయడు అనిపిస్తుంది. దర్శకుడు కమెడియన్ల మీద కూడా ఆధారపడకుండా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత కూడా రామ్ కే ఇచ్చాడు. అతడి పాత్రను అలా తీర్చిదిద్దాడు. రామ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. బబ్లీ గర్ల్ కీర్తి సురేష్  ఫ్రెష్ గా అనిపించింది. ఆమె నటనలో పరిణతి ఉంది. కీర్తి హావభావాలు బాగున్నాయి. ఐతే కొన్ని సన్నివేశాల్లో అవసరానికి మించి మూడీగా, అయోమయంగా కనిపించిందామె. హీరోయిన్ తండ్రి పాత్రలో సత్యరాజ్ మరోసారి తన ప్రత్యేకత చూపించాడు. రోహిణి కనిపించే కొన్ని సన్నివేశాల్లోనే బాగా చేసింది. సినిమాలో అతి పెద్ద సర్ ప్రైజ్ ప్రదీప్ రావత్ పోషించిన మహర్షి పాత్రే. తొలిసారి ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసి నవ్వించాడు ప్రదీప్. ఐతే ఆ పాత్రను మరింతగా వాడుకుని ఉంటే బావుండేదనిపిస్తుంది. ప్రిన్స్, శ్రీముఖి ఓకే. వాళ్లిద్దరి పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యమేమీ లేదు. కృష్ణ చైతన్య తనకు అలవాటైన పాత్రలో బాగా చేశాడు.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ పాటలు సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా క్రేజీ ఫీలింగ్, శైలజా శైలజా పాటలు ఊపేశాయి. నేపథ్య సంగీతం కొంతవరకు బాగానే ఉంది కానీ.. కొత్తదనం లేదు. ఎమోషనల్ సీన్స్ లో ఇంతకుముందు వాడేసిన మ్యూజిక్కే వినిపించాడు దేవి. ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు ఆర్య, మన్మథుడు, బొమ్మరిల్లు లాంటి సినిమాలు గుర్తుకొచ్చేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. స్రవంతి మూవీస్ సినిమా కదా.. నిర్మాణ విలువలకు ఏమీ ఢోకా లేదు. అనవసర హంగులకు పోకుండా మామూలు లొకేషన్లలోనే సినిమా తీశాడు. దర్శకుడు, రచయిత కిషోర్ తిరుమల తన ప్రతిభ చూపించాడు. అతడి నరేషన్ స్టయిల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో లేదు. సన్నివేశాల్లో ఫీల్, ఎమోషన్ తెప్పించడంలో అతను విజయవంతమయ్యాడు. డైలాగులు అతడి అతి పెద్ద బలం. ప్రాసల కోసం పాకులాడకుండా సన్నివేశాలకు తగ్గట్లు అర్థవంతమైన మాటలు రాశాడు. ‘‘నీ వల్ల కలిగే ఏ ఫీలింగ్ అయినా నాకు ఓకే. రీజన్ నువ్వైతే చాలు’’.. ‘‘ప్రేమంటే కలిసి బతకడం, లేకుంటే చచ్చిపోవడం కాదు.. ప్రేమంటే మరిచిపోలేకపోవడం’’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఐతే ప్రథమార్ధం వరకు తన రాతలో, తీతలో కొత్తదనం చూపించిన కిషోర్.. ద్వితీయార్ధంలో అందరి బాటలో నడవడమే నిరాశ పరుస్తుంది. మొత్తంగా అతను రచయితగా, దర్శకుడిగా ఓ ముద్ర మాత్రం వేశాడు.

చివరగా: కొంచెం కొత్తగా.. కొంచెం మామూలుగా..

రేటింగ్- ​3/5
Tags:    

Similar News