'లవ్ స్టోరీ' విషయంలోను అదే జరిగిందే!

Update: 2021-09-25 04:30 GMT
శేఖర్ కమ్ముల గొప్ప దర్శకుడు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఆయన తెరకెక్కించిన ఒకటి రెండు సినిమాలు పక్కన పెడితే, మిగతా వన్నీ ప్రేమకథలే. ఆయన బలం ప్రేమకథలే .. ఆ కథలే ఆయన అందంగా రాసుకోగలరు .. అద్భుతంగా తెరపై ఆవిష్కరించగలరు. అందుకే ఆయనను ప్రేమకథల స్పెషలిస్టు అంటారు. ఆయన ప్రేమకథల్లో ప్రేమికుడు గానీ .. ప్రియురాలుగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. చాలా పరిపక్వతతో ఆలోచించి ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక ప్రేమికుల చేతిలో ప్రధానమైన ఆయుధం పాట. ఆ పాటను పట్టుకుని వాళ్లు పరిగెడుతూ ఉంటే, ప్రేక్షకులు వాళ్లను ఫాలో అవుతూ ఉంటారు.

మొదటి నుంచి కూడా శేఖర్ కమ్ముల కథను రెడీ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. కథపై తనకి పూర్తి నమ్మకం కలిగితేనేగాని ఆయన రంగంలోకి దిగడు. కథా నేపథ్యానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. పాత్రలు .. ఆ పాత్రల స్వభావాలను తీర్చిదిద్దడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అదే సమయంలో ఆ పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకుంటాడు. అందువల్లనే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాల పట్ల ఆసక్తిని చూపుతుంటారు .. ఆదరిస్తుంటారు. అయితే శేఖర్ కమ్ముల కథల్లో ఫస్టాఫ్ అంతటి బలంగా సెకండాఫ్ ఉండదు అనే విమర్శ కూడా లేకపోలేదు.

ఆనంద్ .. గోదావరి .. లీడర్ లాంటి సినిమాల విషయంలో ఈ లోపం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాల ఫస్టాఫ్ ఒక రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. సెకండాఫ్ వచ్చేసరికి ఆ పట్టు నుంచి జారిపోతుంది. కథ బలహీనపడిపోయి సన్నివేశాలలో నుంచి ప్రేక్షకులు బయటికి వచ్చేస్తుంటారు. 'లీడర్' సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి అదుర్స్ అనుకున్న ప్రేక్షకులు, ఆ తరువాత ఒకింత నిరాశకు .. మరికాస్త అసంతృప్తికి లోనవుతారు. ఫస్టాఫ్ లో అంచనాలు పెంచేస్తూ వెళ్లిన శేఖర్ కమ్ముల, సెకండాఫ్ లో ఆ అంచనాలు చేరుకోలేకపోయిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' విషయంలోను ఇలాగే అనిపిస్తుంది.

'ఫిదా' విషయంలోను ఇలాగే జరిగినప్పటికీ, ఫస్టాఫ్ చేసిన ప్రభావితం కారణంగా సెకండాఫ్ లోపాలు ఎక్కువగా కనిపించవు. రీసెంట్ గా రిలీజైన 'లవ్ స్టోరీ' విషయంలోను సెకండాఫ్ కాస్త వీక్ గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెకండాఫ్ లో కుల వివక్ష .. లైంగిక వేధింపులను హైలైట్ చేసే సమయంలో కథ పట్టు సడలినట్టుగా కనిపిస్తుంది .. ఇది శేఖర్ కమ్ముల మార్కు కాదే అనిపిస్తుంది. ఈ పాయింట్ ను టచ్ చేసిన తరువాతనే గ్రాఫ్ పడిపోయిందని అంటున్నారు. అందువల్లనే మిక్స్డ్ టాక్ వచ్చిందని చెబుతున్నారు. 'లవ్ స్టోరీ' సెకండాఫ్ విషయంలోను శేఖర్ కమ్ముల తన బలహీనతను అధిగమించలేకపోయాడనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి.     
Tags:    

Similar News