బాలయ్య మాటలకు కౌంటర్లే కౌంటర్లు

Update: 2017-09-01 04:25 GMT
నందమూరి బాలకృష్ణ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. బాలయ్య మరీ శ్రుతి మించి మాట్లాడాడంటూ సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్ ను పట్టుకుని.. ‘రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు’ అంటూ అంత పెద్ద మాట అనేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తాను చేయాలనుకున్న ‘రైతు’ సినిమాలో అతిథి పాత్ర కోసం అడిగితే కాదని.. చిరంజీవి ‘సైరా’ సినిమాకు మాత్రం ఓకే చెప్పాడన్న కోపంతోనే అమితాబ్ ను ఉద్దేశించి అంత మాట అన్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సినిమా వాళ్లు రాజకీయాల్లో షైన్ అవ్వలేరని.. కావాలంటే రాసిస్తా అని సవాలు విసిరిన బాలయ్య.. తన విషయానికి వచ్చేసరికి ‘మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు’ అంటూ వ్యాఖ్యలు చేయడంపైనా దుమారం రేగుతోంది. దీనిపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక చిరంజీవిని వేలెత్తి చూపించిన బాలయ్య.. హిందూపురం ఎమ్మెల్యేగా ఏం సాధించాడన్న ప్రశ్నలూ సంధించారు సోషల్ మీడియాలో జనాలు. హిందూపురంలో నీటి కొరతతో పాటు పలు సమస్యలపై స్థానికులు ధ్వజమెత్తడం.. బాలయ్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడాన్ని ప్రస్తావిస్తూ బాలయ్యపై విమర్శలు ఎక్కుపెట్టారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవంగా తన అసిస్టెంటుని కొట్టడం.. తర్వాత నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు బహిరంగంగా డబ్బులు పంచడం.. అలాగే ఓ అభిమానిపై చేయి చేసుకోవడం లాంటి పరిణామాలతో బాలయ్య విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీకి కూడా ఆ పరిణామాలు ఇబ్బంది కలిగించాయి. ఇప్పుడు అమితాబ్.. చిరులపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీకి ఇబ్బందికరమే. బాలయ్య కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News