సూర్య‌బ్ర‌ద‌ర్స్‌.. రియ‌ల్ హీరోస్‌

Update: 2021-05-13 07:30 GMT
వెండి తెర‌పై హీరోలుగా వెలిగేవారంతా నిజ జీవితంలో హీరోలు కాదు. సినిమాల్లో పేద‌ల కోసం పాటుప‌డే నాయ‌కులుగా క‌నిపించేవారు.. బ‌య‌ట క‌నీసం వారి జాడ కూడా క‌నిపించ‌దు. సినిమాల్లో ఆస్తులు మొత్తం రాసిచ్చే చాలా మంది.. రియ‌ల్ లైఫ్ లో చిల్లిగ‌వ్వ కూడా దానం చేయ‌రు. ఇలాంటి వారు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఉన్నారు. కానీ.. మ‌రికొంద‌రు ఉంటారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియ‌ల్ లైఫ్ లోనూ నిఖార్సైన హీరోల‌మ‌ని చాటుకుంటారు. అభాగ్యుల‌కు అండ‌గా త‌మ‌వంతు స‌హ‌కారం అందిస్తుంటారు. అలాంటి వారిలో ఒక‌రు సూర్య‌బ్ర‌ద‌ర్స్.

అగ‌రం ఫౌండేష‌న్ ఏర్పాటు చేసి ఇప్ప‌టికే ఎంతో మంది అభాగ్యుల‌ను చ‌ద‌విస్తున్నారు. ఈ ఫౌండేష‌న్ ద్వారా.. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, తొలిద‌శ క‌రోనా వేళ కూడా ముందుకొచ్చి ఎంతో మందికి సేవ‌లు అందించారు. భారీగా విరాళాలు కూడా స‌మ‌ర్పించారు. తాజాగా.. కొత్త‌ ముఖ్య‌మంత్రిని క‌లిసి ఏకంగా కోటిరూపాయ‌ల‌ను అందించారు. కొవిడ్ బాధితుల‌ను ఆదుకోవాలంటు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ఈ మొత్తాన్ని అంద‌జేశారు.

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మ‌ధ్య‌నే ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో.. అంద‌రూ నూత‌న ముఖ్య‌మంత్రిని క‌లిసి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఓ పుష్ప‌గుచ్ఛం, ఓ శాలువా తీసుకెళ్లి ఫొటోలు దిగి, ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీ.. సూర్యబ్ర‌ద‌ర్స్ కుటుంబంతో స‌హా వెళ్లి, కొవిడ్ బాధితుల‌ను ఆదుకోవాలంటూ రూ.కోటి అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం.

దీంతో.. సూర్య కుటుంబంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. చాలా మంది రీల్ హీరోలేన‌ని, సూర్య‌బ్ర‌దర్స్ నిజ‌మైన హీరోలు అని కామెంట్ చేస్తున్నారు. వారి బాట‌లో మ‌రికొంత మంది న‌డిచి, నిజ‌మైన హీరోలుగా నిరూపించుకోవాల‌ని సూచిస్తున్నారు.
Tags:    

Similar News