రానా అలా డిసైడైపోయాడంతే!

Update: 2022-01-05 04:30 GMT
రానా కథానాయకుడిగా దర్శకుడు వేణు ఊడుగుల 'విరాటపర్వం' సినిమాను రూపొందించాడు. నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇందులో నక్సలైట్ నాయకుడిగా రానా కనిపించనున్నాడు. ఆయనపై మనసుపడే గ్రామీణ యువతి పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని అటు రానా ఫ్యాన్స్ .. ఇటు సాయిపల్లవి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు.

అలాగే రానా నటించిన '1945' సినిమా కూడా చాలా కాలంగా విడుదల కోసం వెయిట్ చేస్తోంది. రాజరాజన్ నిర్మించిన ఈ సినిమాకి సత్యశివ దర్శకత్వం వహించాడు. రానా సరసన నాయికగా రెజీనా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. అటు 'విరాటపర్వం' .. ఇటు '1945' ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ కి వెళతాయన్నట్టుగా ఒక మాట వినిపిస్తుంటే. లేదు థియేటర్లకే వస్తాయట అనే టాక్ కూడా బలంగానే వినిపిస్తూ వస్తోంది. దాంతో ఈ ఊగిసలాట ప్రేక్షకులకు అయోమయాన్ని కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారనేది తాజా సమాచారం. ముందుగా '1945' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 7వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇంతకుముందు రానా నుంచి 'అరణ్య' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. కానీ ఆశించినస్థాయిలో ప్రయోజనం దక్కలేదు. ఆ సినిమా అంతగా ఆడలేదు.

ఆ తరువాత రానా నుంచి వస్తున్న సినిమా ఇదే. ఇక వచ్చేనెల రానా నటించిన 'భీమ్లా నాయక్' ప్రేక్షకుల ముందుకు రానుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన నటించాడు. ఈ సినిమాలో రానా సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఈ సినిమా తరువాత 'విరాటపర్వం' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. '1945' కి సంబంధించిన పబ్లిసిటీ ఎక్కువగా జరగలేదు. అందువలన ఆ సినిమాపై అంతగా అంచనాలు లేవు. 'భీమ్లా నాయక్' .. 'విరాట పర్వం'పై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. మరో ఆ సినిమాలు ఎలాంటి రిజల్టును రాబడతాయో చూడాలి.
Tags:    

Similar News