ఫ్లెక్సీ ఏర్పాటులో వివాదం తారక్ ఫ్యాన్ సూసైడ్ అటెంప్టు

Update: 2022-03-22 04:33 GMT
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజువల్ ఫీస్ట్ ‘ఆర్ఆర్ఆర్’ మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే పక్కా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తమ అభిమాన హీరోలు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేసే థియేటర్ల వద్ద ఇప్పటికే తారక్.. చెర్రీ అభిమాన సంఘాల హడావుడి షురూ అయ్యింది. మార్చి 25న విడుదలయ్యే ఈ మూవీకి వెల్ కం చెబుతూ.. ఆ సినిమాను ప్రదర్శించబోతున్న థియేటర్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు ఇద్దరు అగ్ర నటుల అభిమానులు.

ఇదిలా ఉండగా కోదాడలోని శ్రీనివాస థియేటర్ వద్ద అనుకోని రీతిలో వివాదం మొదలైంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్.. చెర్రీ అభిమానులు తమ అభిమాన నటుడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎవరికి వారు.. తమ అభిమాన హీరో ఫ్లెక్సీని ప్రముఖంగా కనిపించేలా ఉండాలన్న పట్టుదలకు పోవటంతో వివాదం మొదలైంది. దీంతో.. ఇరు వర్గాల అభిమానులు పోటీ పడ్డాయి.

ఈ పోటీ కాస్త అనవసరమైన ఉద్రిక్తతకు కారణమైంది. ఈ గొడవ జరుగుతున్న వేళలో.. తారక్ అభిమాని ఒకరు తీవ్రమైన భావోద్వేగానికి గురై.. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. తారక్ అభిమాని పనికి షాక్ తిన్న స్థానికులు.. చెర్రీ అభిమానులు అతడ్ని వారించి అడ్డుకున్నారు. ఈ సూసైడ్ అటెంప్టు గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రియాక్టు అయి శ్రీనివాస థియేటర్ వద్దకు చేరుకొని ఇరు వర్గాల అభిమానుల్ని థియేటర్ నుంచి చెదరగొట్టారు. అంతేకాదు.. ఈ గొడవ మొత్తానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెబుతున్నారు. విడుదల ఉత్సాహంలో ఉన్న ఆర్ఆర్ఆర్ టీంకు షాకిచ్చేలా తాజా ఉదంతం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News