దివ్య నగరంలో పూజలు చేసిన RRR టీమ్..!

Update: 2022-03-23 03:51 GMT
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

జక్కన్న ఎంత శ్రద్ధగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కించాడో అంతే శ్రద్ధగా ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. తన ఇద్దరు హీరోలను వెంటేసుకొని దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా.. సాంస్కృతిక నగరంగా పిలవబడే వారణాసి నగరాన్ని సందర్శించారు.

అందమైన దివ్య నగరం వారణాసికి RRR టీమ్ వెళ్లినట్లు పేర్కొంటూ మేకర్స్ దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇందులో రామ్ చరణ్ - రాజమౌళి - ఎన్టీఆర్ ముగ్గురూ సాంప్రదాయ వస్త్రాల్లో మెడలో రుద్రాక్ష మాల ధరించి ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

మరో ఫొటోని చూస్తే.. ముక్తి స్థలంలో దర్శక హీరోలు ముగ్గురూ పూజలు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. వారణాసిలో RRR టీమ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల రాజమౌళి - చరణ్ - తారక్ లు ప్రసిద్ధ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.

కాగా 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇద్దరు విప్లవ వీరుల జీవిత కథలను స్ఫూర్తిగా ఫిక్షనల్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు జక్కన్న. ఇందులో అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్ గణ్ కీలక పాత్ర పోషించారు.

డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో RRR చిత్రాన్ని నిర్మించారు. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. మార్చి 25న తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Tags:    

Similar News