జూలైలో డ‌జ‌ను .. అయినా క్రేజు ఏదీ?

Update: 2019-07-01 07:18 GMT
తొల‌క‌రి మొద‌లైంది. చిట‌ప‌ట చినుకులు ప‌ల‌క‌రిస్తున్నాయి. రెయినీ సీజ‌న్ (జూలై) లో వ‌స్తున్న సినిమాల మాటేమిటి? అంటే ఇప్ప‌టికే డ‌జ‌ను పైగానే సినిమాలు క్యూలో ఉన్నాయి. ఈనెల 5న ఐదు సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. ఇందులో స‌మంత న‌టించిన ఓ బేబి.. ఆది సాయికుమార్ న‌టించిన బుర్ర‌క‌థ రేసులో ఉన్నాయి. వీటితో పాటు రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి వార‌సుడు మేఘాంశ్ శ్రీ‌హ‌రి న‌టించిన `రాజ్ దూత్` రిలీజ్ బ‌రిలో ఉంది. దుర్మార్గుడు- కె.ఎస్.100 లాంటి చిత్రాలు అదే తేదీకి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఆ త‌ర్వాతి వారంలో ఎన‌ర్జిటిక్ రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ మూవీ ఇస్మార్ట్ శంకర్..జులై 12 లేదా 18న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. సందీప్ కిష‌న్ `నీను వీడని నీడను` నేనే జూలై 12న రిలీజ్ తేదీని లాక్ చేశార‌ట. విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన `దొర‌సాని`.. ష‌క‌ల‌క శంక‌ర్ `కేడీ నం.1`అలాగే `మాయాబజార్` చిత్రాలు ఇదే తేదీకి రిలీజ్ కానున్నాయ‌ని తెలుస్తోంది.

అటుపై వారం.. అంటే జులై 19న నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సీత లాంటి ఫ్లాప్ త‌ర్వాత బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన `రాక్షసుడు` (ర‌చ్చాస‌న్ రీమేక్) రిలీజ్ కానుంది. అదే తేదీకి .. ఆర్.ఎక్స్100 ఫేం కార్తికేయ న‌టించిన `గుణ 369` .. సంపూర్ణేష్ బాబు - కొబ్బరి మట్ట, క‌థ‌నం అనే చిత్రాలు రిలీజ్ కి రానున్నాయి. రిలీజ్ బ‌రిలో ఉన్న వాట‌లో ఇస్మార్ట్ శంక‌ర్ .. దొర‌సాని చిత్రాల‌కు ప్ర‌చారంలో వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఓబేబి- బుర్ర‌క‌థ‌- రాజ్ దూత్ ప్ర‌చారం ప‌రంగా ఫ‌ర్వాలేదు. ఇత‌ర సినిమాల ప్ర‌చారం అంతంత మాత్ర‌మే.

అయితే వీటిలో కొన్నిటికి ఇంకా రిలీజ్ తేదీల విష‌య‌మై చిన్న‌పాటి సందిగ్ధత ఉంది. కురుద్దామా వ‌ద్దా! అని మ‌బ్బులు దోబూచులాడుతున్న‌ట్టే .. రిలీజ్ కి వ‌ద్దామా వ‌ద్దా? అన్న సందిగ్ధ‌త క‌నిపిస్తోంద‌ట‌. ఫ‌లానా తేదీకి వ‌ద్దాం అని అనుకుంటున్నా ఇంకా అధికారికంగా ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల్సి ఉంది.


Tags:    

Similar News