కామెడీ అయిపోతున్న సూపర్ స్టార్

Update: 2021-07-12 10:39 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ తెరపై వీరోచితమైన, సాహసోపేతమైన పాత్రలు చేస్తారు. నిజ జీవితంలో అలా చేయాలనేమీ లేదు కానీ.. కొంచెం దూకుడుగా, ధైర్యంగా వ్యవహరించాలని అభిమానులు ఆశించడంలో తప్పు లేదు. మిగతా విషయాలను పక్కన పెడితే.. రాజకీయాలకు సంబంధించి రజినీ తీరు అభిమానులు ఎప్పుడూ రుచించదు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లే కనిపిస్తాడు. తన సినిమాల ద్వారా పరోక్షంగా రాజకీయాల మీద కౌంటర్లు వేస్తాడు. తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానంటాడు. సరైన సమయంలో అది జరుగుతందంటాడు. ఇలా చెబుతూ చెబుతూనే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. జయలలిత, కరుణానిధిల మరణానంతరం సేఫ్ ల్యాండింగ్ చూసుకుని చివరికి రెండేళ్ల కిందట రాజకీయ అరంగేట్రాన్ని కూడా ప్రకటించారు. కానీ కార్యక్షేత్రంలోకి మాత్రం దిగలేదు. ఇదిగో అదిగో అంటూనే గత ఏడాది ఆఖర్లో అనారోగ్య కారణాలు చూపి రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించాడు.

అప్పుడు రజినీ అభిమానులు ఎంత ఆగ్రహించారో, ఎంతగా తమ నిరసనను తెలియజేశారో తెలిసిందే. కొన్ని నెలలకు ఈ విషయాన్ని జీర్ణించుకున్నారు. నెమ్మదిగా విషయం మరిచిపోయారు. ఐతే ఆ గాయం మానుతున్న సమయంలో ఇప్పుడు రజినీ మళ్లీ రాజకీయాల ప్రస్తావనతో వార్తల్లోకి వచ్చాడు. తన పార్టీని మూసేస్తున్నట్లు ప్రకటిస్తూనే.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని పునరాలోచిస్తానని ప్రకటన చేశాడు. దీనిపై అభిమానులతో మాట్లాడుతున్నట్లు తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బాగా కౌంటర్లు పడుతున్నాయి. రజినీని కామెడీ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ వ్యాఖ్యల గురించి మిగతా వాళ్ల సంగతలా ఉంచితే రజినీ అభిమానుల నుంచే సానుకూల స్పందన లేదు. ఎన్నిసార్లు ఇలా నిర్ణయం మార్చుకుంటారు.. వద్దనుకున్నాక ఊరుకోకుండా మళ్లీ ఈ పునరాలోచన ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చి సానుకూల వాతావరణం మధ్య పరిపాలన చేస్తున్న స్టాలిన్ సర్కారును రజినీ ఎదిరించి రాజకీయాలు చేసే పరిస్థితి లేదని.. రజినీ అనిశ్చిత వైఖరిపై ఇప్పటికే జనాల్లో వ్యతిరేకత ఉందని.. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి సాధించేదేమీ లేదని.. రాజకీయాల్లోకి రానని తేల్చేశాక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం మంచిదని.. మళ్లీ ఇలాంటి ప్రకటనలు చేసి జనాల దృష్టిలో చులకన కావడం, కామెడీ అయిపోవడం తప్ప ఒరిగేదేమీ లేదని అంటున్నారు.
Tags:    

Similar News