జీవిత మాట!... చిరుతో విభేదాలు లేవ్‌!

Update: 2017-11-06 06:15 GMT

జీవితా రాజ‌శేఖ‌ర్‌.. సినిమాల్లో కంటే ఈ జంట రాజ‌కీయంగానే బాగా పాపుల‌ర్ అయింది. ముఖ్యంగా వైసీపీ నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చిన స‌మ‌యంలో ఈ దంప‌తులు ప్ర‌త్యేకంగా మీడియా మీటింగ్‌ లు పెట్టి మ‌రీ జ‌గ‌న్‌ పై ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆ త‌ర్వాత వేరే వేరే పార్టీల్లోకి వెళ్లాల‌ని వీరు ప్ర‌య‌త్నాలు చేసినా ఏవీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో మౌనంగా ఉండిపోయారు. అటు సినిమాలు లేక‌ - ఇటు రాజ‌కీయాలు లేక ఇద్ద‌రూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే, ఇటీవ‌ల గ‌రుడ వేగ మూవీతో రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ ఫామ్‌ లోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ జీవిత మీడియా ముందుకు వ‌చ్చింది. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ అధినేత‌గా ఉన్న చిరంజీవిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన ఆమె ఇప్పుడు.. తూచ్‌.. చిరును నేనెప్పుడు విమ‌ర్శించ‌లేద‌ని చాలా తేలిక‌గా చెప్పేసింది.

వాస్త‌వానికి చిరు - జీవితా రాజ‌శేఖ‌ర్ కుటుంబాల మ‌ధ్య   ప్రజారాజ్యం పార్టీ పెట్టే సమయం నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న ప‌రిస్థితి ఉండేద‌న్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో చిరంజీవిని విమర్శించానికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని రాజశేఖర్ - జీవితలు వదులుకోలేదు. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. చిరంజీవి - రాజశేఖర్‌ లకు పడటం లేదనేది పాత మాట. ప్రస్తుతానికి తమ మధ్య ఏ విభేదాలు లేవంటున్నారు రాజశేఖర్ జీవిత దంపతులు. తాజాగా రాజశేఖర్‌ నటించిన లేటెస్ట్ మూవీ గరుడ వేగ సినిమా ప్రీమియర్ షోకి మెగాస్టార్‌ ని ఆహ్వానించడానికి జీవితతో కలిసి వెళ్లారు. అక్కడ వారికి చిరు ఫ్యామిలీ నుంచి సాదర స్వాగతం లభించింది.

అంతే మరుసటి రోజు న్యూస్‌ హెడ్‌ లైన్స్‌లోకి చేరింది. అయితే దురదృష్టవశాత్తుగా రాజశేఖర్‌ కుటుంబసభ్యుడు మురళి మృతిచెందడంతో చిరంజీవి వెల్లాల్సిన ప్రీమియర్ షో రద్దు అయింది. ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినా - చిరు-రాజశేఖర్ ఒక్కటయ్యారనే వార్త మాత్రం సినీ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. గరుడ వేగ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జీవిత ఈ విషయంపై మాట్లాడుతూ.. చిరుతో తమకెప్పుడూ ఏ రకమైన విభేదాలు లేవని అన్నారు. చిరంజీవిని కలిసిన ప్రతీసారి ఏదో వింత జరిగినట్టుగా చూస్తారని, కానీ తాము తరచుగా సినిమా వేడుకలు - సినీ ప్రముఖుల ఫంక్షన్స్‌లో కలుస్తూనే వుంటామని జీవిత అన్నారు. అయితే, మ‌రి అప్ప‌ట్లో చిరును క‌డిగి పారేసింది ఎవ‌రో ఈవిడే చెబితే బాగుండేది!! ద‌ర్శ‌కురాలిగా - న‌టిగా కూడా ఒకింత గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కురాలిగా మాట్టాడ‌డం కూడా బాగుంది.
Tags:    

Similar News