RRR జ‌క్క‌న్న టెస్ట్ షూట్ ఏమైనట్టు?

Update: 2020-06-25 03:30 GMT
RRR పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేసి.. నిర్మాణానంత‌ర ప‌నుల్ని కానిచ్చేయాల‌ని ఎస్.ఎస్.రాజ‌మౌళి ఎంతో ఆస‌క్తిగా ఉన్నా.. ఊహించ‌ని విప‌త్తు అత‌డికి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేదు. ఉన్న‌ట్టుండి వైర‌స్ మ‌హ‌మ్మారీ ఉరుములా మీద‌ప‌డింది. హైద‌రాబాద్ మెట్రో న‌గ‌రాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. దీంతో షూటింగుల‌కు కేంద్ర‌మైన రాజ‌ధాని న‌గ‌రంలో సినీజ‌నం ఎటు అడుగు వేయాల‌న్నా ప్ర‌మాద‌క‌రంగానే ప‌రిణ‌మించింది. అంతేకాదు.. 50 మంది యూనిట్ స‌భ్యుల‌తో షూటింగులు చేయ‌డం అన్న‌ది ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రాల‌కు సాధ్య‌ప‌డ‌దు కాబ‌ట్టి అది కూడా జ‌క్క‌న్న‌- దాన‌య్య బృందానికి చిక్కులు తెచ్చి పెట్టింది.

మ‌హ‌మ్మారీ ప‌ర్య‌వ‌సానం వ‌ల్ల ముందుగా టెస్ట్ షూట్ పూర్తి చేసి ఆ వీడియోని ప్ర‌భుత్వాధికారుల‌కు చూపించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత‌నే రియ‌ల్ షూట్ కి అనుమ‌తులు ల‌భిస్తాయి. దానికోసం రాజ‌మౌళి అండ్ టీమ్ స‌న్నాహ‌కాల్లోనే ఉన్నారు. తొలిగా డూప్ ల‌ను ఉప‌యోగించి టెస్ట్ షూట్ చేయాల‌ని.. ఆ త‌ర్వాత‌నే రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ల‌ను పిల‌వాల‌ని రాజ‌మౌళి భావించారు.  

కానీ ప్ర‌స్తుత క‌ల్లోలం చూస్తుంటే రాజ‌మౌళికే ఆస‌క్తి స‌న్న‌గిల్లింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు భ‌య‌పెట్టేస్తుంటే షూటింగ్ చేయ‌డ‌మెలా? అన్న సందిగ్ధ‌త ఆయ‌న‌లో క‌నిపిస్తోంద‌ట‌. దీనికి తోడు ఇప్పుడు షూటింగ్ ప్రారంభించినా సెట్స్ కి వ‌చ్చేందుకు చ‌ర‌ణ్ - తార‌క్ సంసిద్ధత‌ను వ్య‌క్తం చేయ‌లేద‌ని తెలుస్తోంది. చెర్రీ స్వ‌యంగా ఫోన్ చేసి మ‌రీ ప్ర‌స్తుత స‌న్నివేశాన్ని రివ్యూ చేయాల్సిందిగా రాజ‌మౌళి బృందాన్ని కోరార‌ట‌. తొలుత షూటింగుకి వ‌చ్చేందుకు ఆ ఇద్ద‌రూ అంగీక‌రించినా ఇప్పుడు సీన్ మారిపోయింద‌ట‌.

దీంతో ఇక ఇప్ప‌ట్లో ఈ షూట్ పూర్త‌వుతుందా లేదా? అన్న‌ది సందిగ్ధ‌మేన‌న్న చ‌ర్చా ఫిలింన‌గ‌ర్ లో సాగుతోంది. 2020 సంక్రాంతి కి రిలీజ్ కుద‌ర‌దు. స‌మ్మ‌ర్ కి కానీ ద‌స‌రాకి కానీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వాయిదా వేయాల్సి ఉంటుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి.
Tags:    

Similar News