పెద్దాయన ఇమేజ్ డ్యామేజ్ చేసేసారు

Update: 2019-02-24 17:30 GMT
ఎన్టీఆర్. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత శక్తివంతమైన ఈ మూడు అక్షరాలు ఇప్పుడు వినకూడని రీతిలో ఆయన జీవితం సినిమాగా తెరకెక్కిన రూపంలో ఘోర పరాజయం మూటగట్టుకుని నందమూరి ఫ్యాన్స్ కి క్షోభను కలిగిస్తున్నాయి. కారణాలు ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే కనీసం అభిమానుల మద్దతు కూడా దీనికి లేదని క్లియర్ కట్ గా అర్థమైపోయింది. బాలయ్య లాంటి స్టార్ హీరో అందులోనూ ఎన్టీఆర్  నటవారసుడు నాన్న మీద సినిమా తీస్తే ఇలాంటి పరాభవం ఎదురుకావడం ఎవరికైనా జీర్ణించుకోవడం కష్టమే.

పట్టుమని మూడు రోజులు గడవకుండానే మహానాయకుడు వసూళ్లు తీసికట్టుగా ఉండటం గురించి ఇంత చర్చ జరుగుతోంది అంటే కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. కథానాయకుడు ఇచ్చిన నష్టాలను ఎంతో కొంత తీరుస్తుంది అనుకుంటే అసలు పబ్లిసిటీ ఖర్చులైనా వస్తాయా అనేలా పరిస్థితి ఉండటంతో ఎవరికీ దిక్కు తోచడం లేదు. నిజానికి కథానాయకుడు మహానాయకుడులో చాలా వాస్తవాలను దాచి పెట్టారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. దానికి కారణాలు లేకపోలేదు. ఎన్టీఆర్ కన్నుమూయక ముందు తన బిడ్డలు చంద్రబాబుతో కలిసి ఎంతటి అన్యాయానికి తెగబడ్డారో స్వయానాఎన్టీఆర్ ఇంటర్వ్యూలలో చెప్పిన వీడియోలు యుట్యూబ్లో ఉన్నాయి.

ఎవరిదాకో ఎందుకు. అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు గారు రాసిన పుస్తకంలో సైతం ఎన్నో చేదు నిజాలు ఉన్నాయి. అవన్నీ కప్పిపెట్టి ఎన్టీఆర్ అంటే ఓ మహోన్నత వ్యక్తి ఏ బలహీనతలు లేవు చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులే విలన్లు అనేలా చూపడం కనెక్ట్ కాలేకపోయింది. అందుకే బయోపిక్ లో నిజాయితి లేదని ప్రేక్షకులు తిరస్కరించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చాక మరో చర్చ పోలిక రూపంలో ఎలాగూ వస్తుంది. అయితే స్వయంగా వారసుడు తీసిన సినిమాకు ఇలాంటి ఫలితం దక్కడం మాత్రం భేతాళ ప్రశ్నను మించిన అయోమయాన్ని సృష్టించింది
Tags:    

Similar News