రాఘవేంద్రరావు దర్శకత్వం వదిలేస్తున్నాడు

Update: 2017-01-09 08:07 GMT
వందలమందితో సమన్వయం చేసుకుని.. కోట్ల రూపాయలతో ముడిపడ్డ సినిమాను తెరకెక్కించడం అంటే చిన్న విషయం కాదు. దర్శకుడిగా ఒక్క సినిమా తీయడమే పెద్ద విషయం. అలాంటిది వందకు పైగా సినిమాలు తీయడం మాటలు కాదు. ఈ ఘనత సాధించిన అరుదైన దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. ఆయన తీసిన సినిమాల్లో మెజారిటీ సక్సెస్ అయినవే. 70 ఏళ్లు పైబడ్డాక కూడా ఉత్సాహంగా ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా తీశాడు దర్శకేంద్రుడు. ఐతే ఇదే ఆయనకు చివరి సినిమా కావచ్చన్నది ఈ చిత్ర వర్గాల మాట. స్వయంగా హీరో నాగార్జునే ఇది రాఘవేంద్రరావుకు చివరి సినిమా అయ్యే అవకాశముందని చెప్పేశాడు.

‘ఓం నమో వేంకటేశాయ’ షూటింగ్ సందర్భంగా రాఘవేంద్రరావు మూణ్నాలుగుసార్లు తనకిదే చివరి సినిమా కావచ్చు అన్నారని.. ఆయన మరిన్ని సినిమాలు తీయాలని తనకు కోరిక ఉన్నప్పటికీ.. ఆయనకు ఇదే చివరి సినిమా అవుతుందేమో అనిపిస్తోందని నాగ్ అన్నాడు. తమ కాంబినేషన్లో మాత్రం ఇది ఆఖరు సినిమా కావచ్చని నాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా తన కెరీర్ ఎదుగుదలలో రాఘవేంద్రుడి పాత్రను గుర్తు చేసుకున్నాడు.

కెరీర్ ఆరంభంలో తడబడుతున్న సమయంలో ‘ఆఖరి పోరాటం’ సినిమాతో తనను కుదురుకునేలా చేశారని.. ఆ తర్వాత తాను తనకున్న జడ్జిమెంట్ స్కిల్స్ తో శివ.. గీతాంజలి లాంటి సినిమాల్లో నటించానని.. హిట్లు కొట్టానని నాగ్ చెప్పాడు. ఐతే వాళ్లేనా నీకు హిట్లిచ్చేది.. అంతకుమించి హిట్టు నేనిస్తా అంటూ రాఘవేంద్రరావు తనతో ‘అన్నమయ్య’ సినిమా తీశారని.. తానేంటి భక్తుడేంటి అనుకుంటుంటే.. ఎలా చేయాలో తనకు నేర్పించారని.. తన కెరీర్ ను మలుపు తిప్పారని.. ఆ తర్వాత శ్రీరామదాసు.. షిరిడి సాయి.. ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ లాంటి సినిమాలు ఇచ్చారని నాగ్ అన్నాడు. ‘మనం’ సినిమా తన తండ్రి కోసం క్లాసిక్ కావాలని ఎలా కోరుకున్నానో.. రాఘవేంద్రరావు కోసం ‘ఓం నమో వేంకటేశాయ’ కూడా అలా క్లాసిక్ లాగా నిలిచిపోవాలని.. తమ కాంబినేషన్లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నానని నాగ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News