‘ఓం నమో’కు లీకు పోటు పడేదట

Update: 2016-11-24 04:10 GMT
అగ్ర హీరోల సినిమాలకు ఇంటి దొంగల బెడద ఎక్కువైంది. చిత్ర యూనిట్ లో పని చేసే ఒకరిద్దరి కక్కుర్తి కోట్లాది రూపాయిలు వెచ్చించే చేసే ప్రాజెక్టులపై దెబ్బ పడేలా చేస్తున్నాయి. తెలిసిన వారి ముందు గొప్పలు ప్రదర్శించుకోవాలనో.. ఎవరికి తెలియంది నీకు మాత్రమే షేర్ చేస్తున్నానన్న గొప్పల కోసమో కానీ.. అనవసరమైన తప్పులు చేస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తనకు అవకాశం ఇచ్చిన వారిని మోసం చేయటమే కాదు..  కెరీర్ ను పణంగా పెట్టేలా చేస్తున్న లీకు వీరుల దెబ్బకు తెలుగు సినిమా ఇబ్బంది పడుతోంది.

మొన్ననే బాహుబలి 2కు సంబంధించిన తొమ్మిది నిమిషాల నిడివి ఉన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో హడావుడి చేయటం తెలిసిందే. దీంతో చిత్ర బృందం చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. బెజవాడకు చెందిన కృష్ణ అనే యువకుడ్ని.. అతడితో పాటు ఆరుగురు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గరున్న సెల్ ఫోన్లను.. ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒకరి వద్ద నాగార్జున నటిస్తున్న ‘‘ఓం నమో వెంకటేశాయ’’ చిత్రానికి సంబంధించిన క్లిప్పింగ్  ఉన్న విషయాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన పోలీసుల ప్రశ్నలకు సదరు నిందితుడు సమాధానమిస్తూ.. తన దగ్గరున్న క్లిప్ ను ఎవరికి షేర్ చేయలేదన్న విషయాన్ని చెప్పినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి 2 లీకు వీరుల్ని గుర్తించటంలో ఆలస్యమై ఉంటే ‘ఓం నమో’కు లీకు పోటు పడేదేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News