మూవీ రివ్యూ : ఊపిరి

Update: 2016-03-25 09:31 GMT
చిత్రం :‘ఊపిరి’

నటీనటులు: అక్కినేని నాగార్జున - కార్తి - తమన్నా - ప్రకాష్ రాజ్ - జయసుధ - ఆలీ - తనికెళ్ల భరణి - గాబ్రియల్ - అనుష్క - శ్రియ - కల్పన - ప్రవీణ్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: పరమ్ వి.పొట్లూరి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వంశీ పైడిపల్లి

విదేశీ భాషా చిత్రాల్ని చడీచప్పుడు లేకుండా ఫ్రీమేక్ చేయడం తప్పితే.. అఫీషియల్ గా రైట్స్ తీసుకుని రీమేక్ చేసి.. ఇది ఫలానా సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని మాతృక గురించి చెప్పడం తెలుగులో ఇప్పటిదాకా చూడలేదు. ఐతే పీవీపీ సంస్థ తొలిసారిగా ఈ మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’ను తెలుగు - తమిళ భాషల్లోకి తీసుకొచ్చింది. తెలుగులో ‘ఊపిరి’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఊపిరి’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

శీను (కార్తి) దొంగతనాలు చేస్తూ బతికేసే ఆవారా కుర్రాడు. శ్రీను అంటే అతడి ఫ్యామిలీలో ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న శీను తల్లి (జయసుధ).. తప్పు చేసి  జైలుకెళ్లాడన్న కోపంతో అతణ్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంది. శ్రీను చెల్లెలు.. తమ్ముడు కూడా అతణ్ని అసహ్యించుకుంటారు. ఈ పరిస్థితుల్లో జైలు నుంచి పెరోల్ పై వచ్చిన శీను.. తనపై ఉన్న కేసు కొట్టేయడానికి సత్ప్రవర్తనను చాటుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి స్థితిలో ఓ ప్రమాదం వల్ల కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకి పరిమితమైన బిలియనీర్ విక్రమాదిత్య (నాగార్జున)కు కేర్ టేకర్ గా చేరతాడతను. నైరాశ్యంలో బతుకుతున్న విక్రమాదిత్యలో శీను వచ్చాక ఎలాంటి మార్పులొచ్చాయి.. విక్రమాదిత్య వల్ల శీను జీవితం ఎలా మారింది.. వీళ్లిద్దరి బంధం ఎక్కడిదాకా వెళ్లింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హ్యూమర్-ఎమోషన్.. రెండూ పూర్తి విరుద్ధమైన విషయాలు. ఈ రెంటినీ కలగలిపి ఓ సినిమా చేయడం... ప్రేక్షకుల్ని రెండు విధాలుగానూ సంతృప్తి పరచడం.. కష్టమైన విషయం. ‘ఊపిరి’ ప్రత్యేకతంగా నిలబెట్టేది ఈ కలయికే. ఓవైపు సున్నితమైన హాస్యంతో ఆద్యంతం నవ్విస్తూ.. పెదాలపై చిరునవ్వు చెరిగిపోకుండా చేస్తూనే.. అక్కడక్కడా గాఢమైన ఎమోషన్లను మనసుకు హత్తుకునేలా పండిస్తూ.. కళ్లను తడి చేస్తుంది ‘ఊపిరి’. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’కు చక్కటి అడాప్షన్ ‘ఊపిరి’.

ఎంత డబ్బున్నా మానసిక ప్రశాంతత లేని బిలియనీర్.. డబ్బు తప్ప తన సమస్యలకు ఏదీ పరిష్కారం కాదనుకునే దొంగ.. పరస్పర విరుద్ధమైన వ్యక్తుల మధ్య సాగే బంధం నేపథ్యంలో అల్లుకున్న ‘ఊపిరి’ కథ.. సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథాకథనాలు కొంతవరకు ‘గమ్యం’ను తలపిస్తాయి. ఎక్కువ పాత్రలేమీ లేకుండానే.. ఏ హడావుడి లేకుండానే ఆహ్లాదంగా సాగిపోయే ‘ఊపిరి’ కథనం.. మనసుకు హాయి గొలుపుతుంది. కమెడియన్ సాయమేమీ లేకుండా.. శీను పాత్రలో కార్తి పండించిన వినోదం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ప్రథమార్ధం మొత్తాన్ని శీను పాత్రే నడిపిస్తుంది.

ఎమోషన్ల మీద పెద్దగా ఫోకస్ పెట్టకుండా చాలా వరకు వినోద ప్రధానంగానే ప్రథమార్ధాన్ని నడిపించడంతో గంటంపావు సినిమా ఎలా గడిచిపోయిందో తెలియనట్లు సాగిపోతుంది. పెయింటింగ్ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ ప్రథమార్ధానికి హైలైట్. ముఖ్యంగా కార్తి-ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఏ హడావుడి లేకుండా.. పంచ్ డైలాగులు లేకుండా.. కమెడియన్లెవ్వరూ లేకుండా.. కడుపుబ్బ నవ్వించే ఇలాంటి సన్నివేశాలు ఈ మధ్య కాలంలో చూసి ఉండం. ఈ సింపుల్ హ్యూమరే ‘ఊపిరి’ అతి పెద్ద బలం.

‘ఊపిరి’ సినిమా ఏంటో చెప్పే ఓ సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. తన చెల్లెలి జీవితాన్ని నిలబెట్టే సాయం తన యజమాని చేయడంతో ఎమోషన్ అయిపోతాడు శ్రీను పాత్రధారి. ఆ పాత్ర తాలూకు ఎమోషన్ ను ఫీలవుతూ మనసు బరువెక్కిన ఫీలింగ్ లో ఉండగా.. ‘‘నేను వెళ్తాను సార్.. అసలే చెల్లి పెళ్లి.. ఖర్చులుంటాయ్.. పెయింటింగ్స్ వేసుకోవాలి’’ అంటూ సీరియస్ గా ఓ కామెడీ డైలాగ్ వేసి మొత్తం వాతావరణాన్ని తేలిక చేసి.. ప్రేక్షకుల పెదాలపై మళ్లీ చిరునవ్వు మొలిపిస్తుంది ఆ పాత్ర. కన్నీళ్లు తెప్పిస్తున్నట్లే తెప్పించి.. అంతలోనే ముఖంపై చిరునవ్వు పులుముకునేలా చేస్తుంది ఈ సన్నివేశం. ‘ఊపిరి’ ఎసెన్స్ అంతా ఈ సన్నివేశంలోనే ఉంది. వినోదానికి వినోదం.. ఎమోషన్ కు ఎమోషన్.. రెండు కలగలిసి సినిమా అంతా ప్రయాణం చేస్తాయి.

ఐతే ప్రథమార్ధంతో సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లిన వంశీ.. ద్వితీయార్ధాన్ని మాత్రం అనుకున్నంత పకడబ్బందీగా నడపలేకపోయాడు. ప్యారిస్ ఎపిసోడ్ లో కథనం దారి తప్పుతుంది.  డ్యాన్సర్ తో విక్రమాదిత్య డేటింగ్.. ఆ తర్వాత అనుష్క పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా లేవు. కార్తి-తమన్నాల మధ్య పాట కూడా ఏదో తమన్నా గ్లామర్ ను కాస్తయినా వాడుకుని మాస్ ఆడియన్స్ ను కాస్త ఎంగేజ్ చేద్దాం అన్నట్లు పెట్టినట్లుంది. సినిమాలో ఆ పాట సింక్ కాలేదు. ప్రథమార్ధంలో వచ్చే ఐటెం సాంగ్ కూడా అంతే. ఇవి రెండూ సినిమా టోన్ ను కొంత దెబ్బ తీశాయి.

ఐతే ప్యారిస్ ఎపిసోడ్ ముగిశాక మళ్లీ కథనం ట్రాక్ ఎక్కుతుంది. ఎమోషనల్ గా సాగే చివరి అరగంట సినిమాకు ఆయువుపట్టుగా నిలుస్తుంది. శ్రీను పాత్ర ఉన్నట్లుండి విక్రమాదిత్యకు దూరమై.. తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్లిపోవడం కాస్త అసహజంగా అనిపించినా.. ప్రిక్లైమాక్స్ - క్లైమాక్స్ ల ఎమోషన్ మాత్రం బాగా పండింది. శీను తన తల్లికి దగ్గరయ్యే క్రమంలో వచ్చే సన్నివేశాలు కదిలిస్తాయి. ఇక చివర్లో తెలుగు సినిమాల తరహాలో మెలో డ్రామాకు అవకాశమివ్వకుండా సింపుల్ గా ముగించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.

ఎమోషనల్ పార్ట్ వరకు ‘ది ఇన్ టచబుల్స్’లోని ఇంటెన్సిటీని ‘ఊపిరి’ మ్యాచ్ చేయలేదు కానీ.. ఓవరాల్ గా సినిమాలోని సోల్ ను మాత్రం మిస్సవలేదు. వినోదం విషయంలో మాతృక కంటే కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఓ ఫ్రెంచ్ సినిమా కథను నేటివిటీ సమస్య రాకుండా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుటుంది. ఆ కథను ఇండియనైజ్ చేయడంలో ‘ఊపిరి’ టీమ్ సక్సెస్ అయింది. ‘ఊపిరి’లోని సింపుల్ హ్యూమర్ - ఎమోషన్స్.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ - ఫ్యామీలీస్ ను బాగా ఆకట్టుకునే అవకాశముంది. ఐతే కార్తి పాత్రతో మాస్ ప్రేక్షకులు కొంత వరకు కనెక్టయినప్పటికీ.. ఈ కథాకథనాలతో ఆ వర్గం ప్రేక్షకులు ఎంత వరకు కనెక్టవుతారన్నదాన్ని బట్టి సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందన్నది ఆధారపడి ఉంటుంది.

నటీనటులు:

నాగార్జున నటన గురించి మాట్లాడ్డానికంటే ముందు ఆయన లాంటి స్టార్ హీరో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకే హ్యాట్సాఫ్ చెప్పాలి. నాగ్ పాత్ర ఏంటన్నది ముందే తెలిసినా.. ఆయన్ని చక్రాల కుర్చీకి అతుక్కుపోయి ఉండే పాత్రలో చూసి జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాగ్ కూడా ఆ పాత్రకు అలవాటు పడ్డానికి కొంత ఇబ్బంది పడ్డ విషయం ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాల్లో అర్థమవుతుంది. కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ తోనే నటించాల్సి రావడంతో కొన్ని చోట్ల నాగ్ వీక్ గా కనిపించాడు. ఐతే పాత్రకు అలవాటు పడ్డాక ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ద్వితీయార్ధంలో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నాగ్ నటన ఆకట్టుకుంటుంది. ఇక నాగ్ కంటే కూడా సినిమాలో హైలైట్ అయింది.. సినిమాకు అసలైన ‘ఊపిరి’ ఇచ్చింది మాత్రం కార్తీనే. అమాయకత్వం-అల్లరి కలగలిపిన శీను పాత్రను అద్భుతంగా పండించాడు కార్తి. సినిమాలో వినోదాన్ని పండించే బాధ్యత దాదాపుగా తనే తీసుకున్నాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించాడు కూడా. తమన్నాది అనుకున్నంత ప్రాధాన్యమున్న పాత్రేమీ కాదు కానీ.. ఆమె తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. ప్రకాష్ రాజ్ మంచి పాత్ర చేశాడు. హుందాగా నటించాడు. కార్తి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ మంచి వినోదం పండించాడు. జయసుధ.. కార్తి చెల్లెలిగా చేసిన అమ్మాయి బాగా నటించారు. ఆలీ - తనికెళ్ల భరణి పాత్రలకు తగ్గట్లు నటించారు. అనుష్క - శ్రియ - గాబ్రియల్ - అడివి శేష్ అతిథి పాత్రల్లో మెరిశారు.

సాంకేతికవర్గం:

ఊపిరి తరహా ఫీల్ గుడ్ సినిమాలకు సంగీతం-ఛాయాగ్రహణం ఎంతో కీలకం. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్.. సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ నిరాశ పరచలేదు. గోపీ తన నేపథ్య సంగీతంతో సినిమాకు బలంగా నిలిచాడు. ఐటెం సాంగ్.. డ్యూయెట్ మినహాయిస్తే మిగతా పాటలు కూడా బాగున్నాయి. సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు గోపీ. పి.ఎస్.వినోద్ తన కెమెరా పనితనం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. సినిమా ఆద్యంతం చాలా రిచ్ గా కనిపిస్తుంది. పీవీపీ సంస్థ ప్రత్యేకత మరోసారి కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి. అబ్బూరి రవి మంచి మాటలు రాశాడు. ఇక మున్నా-బృందావనం-ఎవడు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి నుంచి ‘ఊపిరి’ తరహా సినిమాను ఆశించి ఉండం. ఇప్పటిదాకా తాను చేసిన సినిమాల ముద్ర నుంచి బయటికి వచ్చి.. పూర్తిగా భిన్నమైన ఫీల్ గుడ్ మూవీ తీశాడు. ‘ది ఇన్ టచబుల్స్’లోని సోల్ మిస్సవకుండానే.. తెలివిగా ఇండియనైజ్ చేసి.. మన నేటివిటీకి తగ్గట్లుగా చక్కగా తీర్చిదిద్దాడు వంశీ. ద్వితీయార్ధంలో కొంచెం పట్టు తప్పినట్లు కనిపించినా.. ఓవరాల్ గా స్క్రిప్టుపై అతడి పట్టు కనిపిస్తుంది.

చివరగా- మనసు తలుపు తట్టే ‘ఊపిరి’

రేటింగ్- 3.25/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News